ఆందోళనతో అట్టుడికిన ఓరుగల్లు
వరంగల్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, వెయ్యి రోజుల కాలంలో అన్ని విధాలుగా మోసగించిందని, 420 హామీలతో కాలం నెట్టుకొచ్చిందని ఆరోపిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ బుధవారం చేపట్టిన ఆందోళనలతో అట్టుడికి పోయింది.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) ఆధ్వర్యంలో 420 అడుగుల ఫ్లెక్సీ తో పట్టణంలో మహా ర్యాలీ నిర్వహించారు. అలాగే జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఇదేవిధంగా వివిధ జిల్లాల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు వివిధ రకాల కార్యక్రమాలతో నిరసన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలకు గ్యారెంటీ కార్డులు ఇచ్చి, అందులో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేంతవరకు బిఆర్‌ఎస్ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.






