24 April, 2026 | 10:25 PM

ఆంధ్రాలో ఆస్ట్రిచ్ గూడు

27-06-2024 12:05 AM

41 వేల ఏండ్లనాటి శిలాజం వెలికితీత

హైదరాబాద్, జూన్ 26: ఆస్ట్రిచ్‌లు ఎడారి ప్రాంతాల్లో ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ, ఎలాంటి ఎడారి లేని ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఆస్ట్రిచ్ పక్షి గూడును అంతర్జాతీయ పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అది కూడా ఏకంగా 41 వేల ఏండ్ల నాటి గూడు కావటం గమనార్హం. వడోధరలోని ఎంఎస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా పరిశోధకులతో కలిసి ప్రకాశం జిల్లాలో ఇటీవల తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో దాదాపు 10 అడుగుల వ్యాసార్థంతో ఉన్న ఆస్ట్రిచ్ పక్షి గూడును గుర్తించారు. అందులో ఏకంగా 911 ఆస్ట్రిచ్ గుడ్లు శిలాజాల రూపంలో ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతి పురాతన ఆస్ట్రిచ్ గూడు అని ఎంఎస్ యూనివర్సిటీ చరిత్ర, పురావస్తు శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవర అనిల్‌కుమార్ వెల్లడించారు. ఈ పరిశోధనతో ప్రాచీన కాలంలో దక్షిణభారత దేశంలో కూడా ఆస్ట్రిచ్ పక్షులు విరివిగా ఉండేవని తేలింది.