కనబడకుంట!
- కబ్జాదారుల కబంధహస్తాల్లో కందనూలు
రియల్టర్ల చేతిలో కుంటలు, చెరువులు
కొందరు మట్టి, కొందరు ప్లాట్ల బేరం
లీడర్లు, ఆఫీసర్లకు తెలిసే కబ్జాల పర్వం
నాగర్‌కర్నూల్, జూన్ 26 (విజయక్రాంతి) : ఖాళీ జాగలు అయిపోయా యేమో! రియల్టర్లు చెరువులు, కుంటల మీద పడ్డారు. కనపడిన కుంటలనల్లా కబ్జా చేసేస్తున్నారు. పార్టీలకతీతంగా లీడర్లంతా ‘చేతు’లు కలిపి ప్లాట్ల బేరానికి తెగబడుతున్నారు. అధికారులను మచ్చిక చేసుకుని మట్టిని, భూమిని చెరబడుతున్నారు. భవిష్యత్ తరాలకు నిల్వ నీడ, తాగు, సాగునీటి వనరులు లేకుండా ప్రశ్నార్థకంలో పడేస్తున్నారు. నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు. చెరువులు, వాటికి అనుసంధానంగా ఉన్న కుంటలు ఇప్పటికే రియల్టర్ల చేతుల్లో చిక్కుకున్నాయి. ఆర్నెళ్ల క్రితం వరకు అప్పటి అధికార పార్టీ లీడర్ల కనుసన్నల్లో జరిగిన దందా ఇప్పుడు ‘చెయ్యి’ మారింది. అయినా అంతా కలగలిసి అధికారులను తమ మాయలో పడేసుకుని కందనూలులోని కంటలను తమ కబంధహస్తాల్లో బంధించారు.
ఇక్కడ తవ్వి.. అక్కడ పోసి..!
పట్టణ శివారుల్లోని చెరువులు, కుంటలపై కన్నేసిన రియల్టర్లు వాటిని వెంచర్లు మార్చేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నచిన్న కుంటలపై పడుతున్నారు. అక్కడి మట్టిని జేసీబీలు, హిటాచీలతో తవ్వి.. పట్టణ ప్రాంతా లకు తరలిస్తున్నారు. తమకు అవసరం ఉన్నంత వరకు మట్టిని ఉపయోగించుకుని ఇతరులకు అమ్మి అలా కూడా సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో టిప్పర్ మట్టి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు విక్రయిస్తున్నట్లు వ్యాపారులే చెబుతున్నారు.
కేసరి సముద్రాన్నీ వదలకుంట
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రధాన జలవనరు కేసరి సముద్రం. గత ప్రభుత్వం దీని పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. అయితే, ఆ ముసుగులో అప్పటి అధికార పార్టీ లీడర్లు తెరవెనుక కొంత భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అధికారుల అండదండలతో విలాసవంతమైన భవనాలు వెలియడంపై విమర్శలు ఉన్నాయి. అధికారులు పట్టించుకోకపోయినా.. కొందరు పర్యావరణవేత్తలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ను ఆశ్రయించారు. ఆ భవనాలను కూల్చేసి బయోఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించినా.. అధికారం ముసుగులో ఆ ఆదేశాలు వెలుగులోకి రాకుండా పోయాయి.
జిల్లా అంతటా ఇదే పరిస్థితి..
జిల్లా కేంద్రంలోనే కాదు, జిల్లాలోని ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్న మండలాలు, గ్రామాల్లోనూ రియల్టర్లు కాలు మోపారు. జిల్లాలో మొత్తం 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామాల్లో సుమారు 300కు పైగా చెరువులు, వాటికి అనుసంధానంగా 3,500కు పైబడి కుంటలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే చాలావరకు చెరువులు కబ్జాకోరల్లో చిక్కుకున్నా యి. చెరువులను కబ్జా చేసేందుకు కుంటల్లో మట్టిని తవ్వి.. వాటిని చెరబడుతున్నారు. దాదాపు 2వేల కుంటలు రియల్టర్ల చేతుల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మొద్దునిద్రలో ఐదు శాఖలు!
చెరువులు, కుంటలు యధేచ్ఛగా కబ్జాకు గురవుతున్నా ఏ ఒక్క శాఖ అధికారి కూడా పట్టించుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. పంచాయతీ, మున్సిపాలిటీ, రెవెన్యూ, నీటిపారుదల, మైనింగ్ ఇలా ఐదు శాఖల అధికారులు అజమాయిషీ చేసే అవకాశం ఉంటుంది. అయినా, ఏ ఒక్క శాఖ అధికారి ఏనాడూ గట్టిగా మట్టి లారీలను గానీ, తవ్వకాలను గానీ అడ్డుకున్న దాఖలాలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వీరంతా, రియల్టర్లు, వారి ముసుగులో ఉన్న లీడర్ల మూమూళ్ల వలలో చిక్కుకుని మట్టి తవ్వకాలను అడ్డగోలుగా వెలుస్తున్న వెంచర్లను చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారనేది జగమెరిగిన సత్యం.. అని ప్రజలు బహిరంగంగానే చర్చించుకోవడం గమనార్హం.
భవిష్యత్తు ప్రశ్నార్థకమే..!
ఇప్పటికే పలు ప్రాంతాల్లో తాగు, సాగునీటికి అష్టకష్టాలు పడుతున్న వార్తలు, కథనాలు తరచూ చదువుతూనే ఉన్నాం. ఉన్న నీటివనరులనైనా రక్షించుకోకపోతే భవిష్యత్ తరాలు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలను చెరబట్టడం వల్ల సాగునీటి సమస్య పెరిగే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. మరి.. జిల్లాలోని ఉన్నతాధికారు లు కబ్జాల బాగోతంపై దృష్టిసారించి మట్టి తవ్వకాలకు, ప్లాట్ల అమ్మకాలకు అడ్డుకట్ట వేస్తారా, లేదా వేచిచూడాల్సిందే.
పోలీసులకు, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశాం
నాగర్‌కర్నూల్ మండలం ఉయ్యాలవాడ ఊరకుంట, అమండకుంటలను ధ్వంసం చేస్తున్నట్లు గుర్తించాం. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నాగర్‌కర్నూల్ పోలీసులకు, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశాం. కేసరి సముద్రం చెరువులోనూ నల్లమట్టి తవ్వకాలపైనా ఫిర్యాదు చేశాం.
డి.గౌతంరెడ్డి,
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, సబ్ డివిజన్
వాళ్లే చూసుకుంటామన్నారు..!
ఉయ్యాలవాడ ఊరకుంటలో అక్రమంగా మట్టిని నింపినట్లు గత నెల 25న ఇరిగేషన్ శాఖ అధికారులు నుంచి ఫిర్యాదు అందింది. అందుకు బాధ్యులను పిలిచి మాట్లాడాం. కానీ ఇరిగేషన్ ఏఈ వచ్చి ‘మేం చూసుకుంటాం’ అని వెళ్లిపోయారు.
గోవర్దన్, ఎస్సై నాగర్‌కర్నూల్






