22-03-2025 12:00:00 AM
ఆచార్య మసన చెన్నప్ప :
ఒక పుస్తకం అచ్చయి మన చేతుల్లో ఉందంటే దాని వెనుక రచయితలు, ప్రచురణకర్తల కృషి ఎంతో ఉంటుంది. రచయిత ఎంత గొప్ప రచనలు చేసినా వాటిని ముద్రించే వారు లేకపోయినా లేదా అందుకు కావలసిన ఆర్థిక వనరుల కొరత ఉన్నా పుస్తకం వెలుగుచూడదు.
“డబ్బు పెట్టి కొనే పాఠకులు ఎంద రు ఉన్నారు?” అన్నది పక్కన పెట్టి, అసలు మంచి జ్ఞాన విశేషాలు పుస్తక రూపు సంతరించుకోకుండా కాలగర్భంలో కలిసిపోతుండడం మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ముద్రణకు అయ్యే ఖర్చును ఎంతో కొంతమేర అయినా భరించగల ఔదార్యం, సౌజన్యం గలవారు సమాజంలో ఎందరున్నారు?
ఒక సినిమా చాలారోజులు ఆడుతుందంటే అందుకు కారణం ప్రేక్షకులు. అదే విధంగా ఒక కవిగాని, రచయితగాని సమాజంలో నిలబడి ఉన్నాడంటే పాఠకులే కారణం. ఐతే, ‘ఈ రోజుల్లో రచయితల సంఖ్య పెరిగిందని, పాఠకుల సంఖ్య తగ్గిందని’ అంటుంటారు. ఆయా పత్రికల్లో వెలువడేవే కాక అముద్రితంగా వుండిపోతున్న గొప్ప రచనలు కూడా అనేకం ఉంటాయి.
మరోవైపు కొందరు రచయితలైనా కొన్ని మంచి పుస్తకాలనైనా రచించి, వ్యయప్రయాసలకు ఓర్చి ప్రచురిస్తున్నారంటే ‘ఆర్థిక ఖర్చులు వారు తాము సొం తంగానైనా భరించుకుంటూ ఉండాలి లేదా ఎవరో ఏదో ఒక రూపంలో వారికి పోత్సాహకాలు అందిస్తూ అయినా ఉం డాలి’.
ప్రభుత్వ, సాహితీ సంస్థలు, విశ్వవిద్యాలయాల నుంచి కవులు, రచయితలకు అందుతున్న ఆదరణకంటే ఎక్కువగా పుస్తకాల ప్రచురణకు ప్రోత్సాహం వాళ్లవాళ్ల స్నేహితులు, ఆత్మీయులు, అభిమాన పాఠకులు వంటి వారి నుంచే అందుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
అటువంటి సౌజన్యమూర్తులే లేకపోతే, నా రచనలు సైతం పలు పుస్తకాల రూపంలోకి వచ్చేవి కావు. అటువంటి పలువురు శిష్యులు, అభిమానులంతా నాకు ఒక ఎత్తు అయితే, నాకు స్వయంగా పాఠాలు చెప్పకపోయినా, గురు సమానులైన ఓయూ ఆచార్యవర్యులు వంగపల్లి విశ్వనాథం వారు ఒక్కరు మరో ఎత్తు అంటే అతిశయోక్తికాదు.
‘ప్రతిభగల వారే ప్రతిభ ఉన్నవారిని గౌరవిస్తారు’ అన్న డా.సినారె వారి మాట లు అక్షరసత్యాలు. అందుకే, రచయితలుగాని, కవులుగాని ఎంత ప్రతిభావంతు లై నా, వారిని గుర్తించే సహృదయులు లభిం చడం అదృష్టమే. అప్పటికి ఓయూలో అధ్యాపకునిగా ఉద్యోగంలో చేరి ఆరు నెలలైంది. కొత్తగా నాతోపాటు ఆయా సబ్జ క్టులలో అరవై మందికిపైగా చేరారు.
యూనివర్సిటీ నిబంధనల ప్రకారం కొత్తగా చేరిన అధ్యాపకులకు మూడు వారాల ‘ఓరియంటేషన్ కోర్సు’ ఉండేది. దాన్ని పూర్తి చేసుకున్నాకే ‘రిఫ్రెషర్ కోర్సు’కు అనుమతించేవారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా వివిధ ప్రాపంచిక విషయాలపై మాకు అవగాహన ఏర్పడటానికి పలువురు నిపుణులను రప్పించి ఉపన్యాసాలు ఇప్పించేవారు.
కోర్సు పూర్తయ్యాక పరీక్ష పెట్టేవారు. ఒక్కొక్కరం ఐదు లేదా ఆరు నిమిషాలు నచ్చిన విషయాల మీద మాట్లాడవలసి వచ్చేది. మా సంక్షిప్త ప్రసంగాలను విని, మాలో ఒకరిని ఉత్తమోత్తమునిగా నిర్ణయించే వారు. అలా వచ్చిన వారిలో ఆచార్య వంగపల్లి విశ్వనాథం వారు ఒకరు.
నిజమైన పెట్టుబడిదారులు
అది 1990 ప్రాంతం. వంగపల్లి వారు విశ్వవిద్యాలయ వాణిజ్యశాఖలో ప్రొఫెసర్. ప్రాపంచిక విషయాలపట్ల గొప్ప అవగాహన కలిగిన వారేకాక నిరాడంబరులు కూడా. ఉత్తమశ్రేణి ఆచార్యులు. సంక్షిప్త ప్రసంగంలో ఆయన నన్ను ప్రథమునిగా ప్రకటించారు. అప్పటి నుంచి ఆయనపై నాకు గౌరవ ప్రపత్తులు ఏర్పడ్డాయి. వారు కూడా ఎక్కడ కనిపించినా నన్ను ప్రేమతో పలకరించే వారు.
ఆయన నాకు తెలుగు చెప్పిన మాష్టారు కారు కాని, తనకు తెలుగులో ఎంతో అభినివేశం ఉంది. తెలుగు సాహిత్యం పట్ల ఆయనకు ఉన్న ప్రేమను తెలుగేతర అధ్యాపకులలో నేను చూసి ఎరుగను. అప్పట్లో ‘యువభారతి’ సంస్థకు తొలినాళ్ల నుంచి ఆయనే సమావేశకర్తగా ఉండేవారు.
లోకంలో మనలను గుర్తించిన వారు ఎందరున్నా మనం వారిని గుర్తు పెట్టుకోవచ్చు. కాని, మనకు గుర్తింపు నిచ్చిన వా రు మనలను గుర్తు పెట్టుకోవడం నిజంగా గొప్ప విషయం. విశ్వనాథం వారు ఏ సభలో కనిపించినా నాపట్ల ఎంతో ఆప్యాయతను, అభిమానాన్ని చూపిస్తారు. నా రచనా కృషిని తెలుసుకునే వారు. నా రచనలు ఇస్తే అభిప్రాయాన్ని తెలియజేసే వారు. ఏదో విధంగా ముప్పు ఏళ్లకు పైగా వారు నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు.
ఐదేళ్ల క్రితం ‘తెలంగాణ గాంధీ స్మారకనిధి’ ఆధ్వర్యంలో మహాత్ముని 150వ జయంతి ఉత్సవాలు జరిగాయి. వాటిల్లో ఆచార్య విశ్వనాథం, కసిరెడ్డి వెంకటరెడ్డి వంటి పెద్దలతోపాటు నేనూ పాల్గొన్నాను. వంగపల్లి వారి పక్కనే కూర్చున్నాను ఆ సభలో. ఆయన నాకేసి ప్రేమతో చూస్తూ అడిగారు
“చెన్నప్పా! ‘నమస్తే తెలంగాణ’లో నీ ఆధ్యాత్మిక వ్యాసాలు బాగా వస్తున్నాయి. నేను ప్రతి వ్యాసం చదువుతున్నాను.. నాదొక కోరిక. వాటన్నింటినీ కలిపి ఒక పుస్తకంగా తీసుకొనిరా. నీకు శుభం కలుగుతుంది..” అని, నా చేతికి ఒక కవరు ఇచ్చారు. తర్వాత అది విప్పి చూస్తే అందులో మూడు వేల రూపాయలు ఉన్నాయి.
దాంతో పై పత్రికలో అప్పటి వరకూ అచ్చయిన 30 వ్యాసాలను ‘చింతన’ పేరుతో పుస్తకంగా తెచ్చాను. అంత టితో వంగపల్లి వారు ఊరుకోలేదు. ‘చింతన’ను ఆంగ్లంలోకి అనువదింపజేశారు. అలా ఆ పుస్తకం ‘కాంటెప్లేషన్’ పేరుతో ఆంగ్లంలోనూ వెలువడింది.
ఆ తర్వాత మరి కొన్నాళ్లకు వంగపల్లి వారు ఫోన్‌లో మాట్లాడుతూ
“ఇప్పటికి ఎన్ని వ్యాసాలు అయ్యాయి?” అన్నారు.
“డ్బ్బు దాకా వచ్చాయి..” అన్నాను.
ఆ తర్వాత ఒకరోజు ఆయన ఫోన్ చేసి
“ఆ డెబ్బయి వ్యాసాలనూ అచ్చు వేయండి..” అన్నారు. అచ్చు వేసిన తర్వాత
“నాకో వంద పుస్తకాలు పంపండి..” అ న్నారు. వారు చెప్పినట్లే ‘హృదయ కమలం’ పేరుతో అచ్చు వేసి పుస్తకాలు పంపించాను. అప్పటికి ఆయన ఊరుకున్నారా? లేదు. మళ్లీ ఒక కవరు పంపించారు. అందులో ఐదు వేల రూపాయలు ఉన్నాయి. చిత్రమనిపించింది నాకు. హార్దికంగానేకాక ఆర్థికం గానూ ప్రోత్సహించే ఇలాంటి వారు సమాజంలో ఉంటే రచయితలకు కష్టాలు ఉండ వనిపించింది.
కవికిగాని, లతకుగాని ఆధారం తప్పనిసరి. పూర్వం రాజులు కవులను ఆదరించేవారు. ఈ రోజుల్లో కవుల ను ప్రోత్సహించే వారు పాఠకులే. వారితోపాటు విశ్వనాథం వంటి విద్వన్మయులు ఇంతటి సౌజన్యాన్ని చూపితే, రచయితలు, కవులు కూడా తమ రచనల్లో అంతులేని ప్రతిభను చూపగలరని అనిపించింది. ఉత్సాహం కవిదైనా, ప్రోత్సాహం నిజంగా ఇటువంటి మహానుభావులదే.
వ్యాసకర్త సెల్: 9885654381