16 June, 2026 | 3:32 AM

నిబంధనలు బేఖాతరు..

16-06-2026 02:33 AM

ఫిట్ నెస్ లేకున్నా రోడ్ల పైకి

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కాలం చెల్లిన బస్సులు 400 పైనే

నోటీసులతో సరి.. చర్యలు శూన్యం

కరీంనగర్, జూన్ 15 (విజయక్రాంతి): ప్రైవేట్ విద్యాసంస్థలు ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతూ రవాణా శాఖ నిబంధనల ను బేఖాతరు చేస్తున్నాయి. ఈనెల 15 నుం చి పాఠశాలలు ఉన్న ప్రారంభమవుతుండగా ఇప్పటివరకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. రవా ణా శాఖ ఉదాసీనత చూపుతుండడంతో ఆం దోళన వ్యక్తం అవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మొత్తం 2,249 విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి.

అందులో ఇప్పటివరకు కేవలం మెజారిటీ బస్సులకే పరీక్షలు పూర్తి కాగా, ఇంకా 512 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాల్సి ఉం ది. కరీంనగర్ జిల్లాలో 1181 బస్సులకుగాను ఇప్పటివరకు 600బస్సులు ఫిట్నెస్ పూర్తి చేసుకున్నాయి. మరో 239 ఫిట్నెస్ పరీక్షలు పూర్తి కావాల్సి ఉంది. ఈ జిల్లాలో  332బస్సులు 15 ఏండ్ల గడువు ముగిసిపోయాయి. రవాణా శాఖ నిబంధనల ప్రకారం 15 ఏళ్ల కాలపరిమితి దాటిన వాహనాలను స్కూల్ బస్సులుగా నడపడానికి వీల్లేదు. ఉమ్మడి జి ల్లాలో ఏకంగా 433 బస్సులు 15 ఏళ్ల గ డువు పూర్తి చేసుకుని స్క్రాప్ నాకు వెళ్లాల్సిన స్థితిలో ఉన్నాయి.

ఒక్క కరీంనగర్ జిల్లాలోనే ఇలాంటివి 332 బస్సులు ఉండటం గమనా ర్హం. కొన్ని బస్సులకు గడువు ముగియడానికి మరో 3 నుండి 6 నెలల సమయం మా త్రమే ఉండటంతో, వాటిపై పైసా ఖర్చు పెట్టడానికి యాజమాన్యాలు సిద్ధంగా లేవు. ఫలి తంగా ఈ డొక్కు బస్సులనే రోడ్లపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతం లో దేశరాజపల్లిలో బస్ బావిలో పడ్డ సంఘటన జరిగింది. అనేక సార్లు స్కూల్ బస్ ప్రమాద సంఘటనలు చోటు చేసుకున్నా అ ధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు.

మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ప్రతి బ స్సును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఫి ట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో తనిఖీలు తూతూమంత్రంగా సాగు తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. బస్సులను స్వయంగా నడిపి బ్రేకుల సామర్థ్యాన్ని, స్టీరింగ్ కండిషన్ను అధికారులు చూడటం లేదు. అత్యవసర ద్వారం స క్రమంగా తెరుచుకుంటుందా లేదా అని చూ డటం లేదు. ప్రథమ చికిత్స పెట్టెలో కనీస మందులు ఉన్నాయా, గడువు ముగిసినవా అని పరిశీలించడం లేదు.

ఎంవీఐ రూల్ 185 (జీ) ప్రకారం ప్రతి పాఠశాల యాజమాన్యం తప్పనిసరిగా 32 రకాల నిబంధనలను పాటించాలి. బస్సు విధిగా పసుపు రం గులో ఉండాలి. పవర్ స్టీరింగ్, గేర్ లీవర్ అంతర్గత స్ప్రింగ్ బాగుండాలి. డాష్ బోర్డు లో లెఫ్ట్, రైట్ ఇండికేటర్లు, బ్రేక్ లోపాన్ని తెలిపే రెడ్ ఇండికేటర్, స్పీడో మీటర్ పని చే యాలి. వెనుక ట్రాఫిక్ కనిపించే అద్దాలతో పాటు, బస్సు లోపల విద్యార్థుల కదలికలు చూసేందుకు ఇంటర్నల్ మిర్రర్, పిల్లలు ఎక్కడం-దిగడం స్పష్టంగా కనిపించేలా ’కన్వీక్స్ క్రాస్ వ్యూ’ అద్దాలు ఉండాలి.

విద్యార్థులు సులభంగా ఎక్కడానికి మొదటి మెట్టు భూమి నుంచి 325 మిల్లీమీటర్ల కంటే ఎ క్కువ ఎత్తులో ఉండకూడదు. డ్రైవర్ కు కనీ సం 5 ఏండ్ల అనుభవం ఉండాలి. వయస్సు 60 ఏళ్లు దాటకూడదు. మద్యం సేవించి వాహనం నడపరాదు. డ్రైవర్ లైసెన్స్, బ్యాడ్జ్ నంబర్, స్కూల్ కరస్పాండెంట్ నంబర్ డ్రైవ ర్ సీటు కుడివైపున ప్రదర్శించాలి. పాఠశాల పూర్తి వివరాలు, బస్సు నంబర్, ఇన్సూరెన్స్, టాక్స్, డ్రైవర్, అటెండర్ ఫోటోలను ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేసి, ఫీజు చెల్లించిన తర్వాతే ఫిట్నెస్ పరీక్షకు తీసుకురావాలి. ఇందులో స గం నిబంధనలు కూడా యాజమాన్యాలు పా టించడం లేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.