కస్టమర్లకు తెలియకుండానే.. బిల్లుల్లో రూ.234 అదనం!
- చేవెళ్ల ‘మోర్’ సూపర్ మార్కెట్ బాగోతం బట్టబయలు
- ఆఫర్ల పేరుతో నిలువుదోపిడీ.. ప్రశ్నిస్తే యాజమాన్యం అహంకారపు మాటలు
- బల్దియా కమిషనర్, చైర్మన్‌కు పీడీఎస్యూ ఫిర్యాదు..
- బాధితులకు డబ్బులు వాపస్ ఇవ్వాలని డిమాండ్
చేవెళ్ల, జూన్ 15 (విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలో నూతనంగా ప్రారంభమైన ‘మోర్’ సూపర్ మార్కెట్ నిర్వాహకులు ఆఫర్ల పేరుతో ప్రజలను నట్టేట ముంచుతున్నారు. కస్టమర్ల అనుమతి, కనీస సమాచారం లేకుండానే బిల్లుల్లో ‘మోర్ ప్లస్ డైమండ్ సబ్స్క్రిప్షన్’ పేరిట అదనంగా రూ. 234 వసూలు చేస్తూ గుట్టుచప్పు డు కాకుండా పెద్ద దోపిడీకి తెరలేపారు. ఆదివారం ఒక్కరోజే వందలాది మంది ఖాతా దారుల నుంచి ఇలా లక్షలాది రూపాయలు అక్రమంగా గుంజినట్లు సమాచారం.
ఈ మోసపూరిత వ్యవహారాన్ని నిరసిస్తూ, సద రు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్ డి మాండ్ చేశారు. ఈ మేరకు ఆయన స్థానిక మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ దేవర సమత వెంకట్ రెడ్డిలకు సోమవారం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
అనుమానంతో చెక్ చేస్తే అడ్డంగా దొరికిపోయారు
మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటైన మోర్ సూపర్ మార్కెట్కు వీకెండ్ కావడం తో ఆదివారం నాడు ప్రజలు భారీగా తరలివచ్చారు. అయితే, కొనుగోలు చేసిన వస్తు వుల ధర కంటే బిల్లు మొత్తం ఎక్కువగా వ స్తుండటంతో అనుమానం వచ్చిన కొందరు కస్టమర్లు నిశితంగా పరిశీలించారు. అందు లో తమకు ప్రమేయం లేని ‘మోర్ ప్లస్ డై మండ్ సబ్స్క్రిప్షన్’ పేరిట రూ. 234 అదనం గా చార్జ్ చేసినట్లు గుర్తించి షాకయ్యారు.
ఏం చేసుకుంటారో చేసుకోండి.. యాజమాన్యం దురుసు సమాధానం..
ఈ దగాపై బాధితులు మోర్ నిర్వాహకులను నిలదీయగా.. వారు కస్టమర్లపైనేదబాయింపులకు దిగారు. ‘మేము ముందే చెప్పాం.. ఏం చేసుకుంటారో చేసుకోండి! ఏ కోర్టులో కేసు వేసు కుంటారో వేసుకోండి!’ అంటూ అత్యంత అహంకారపూరితంగా, బాధ్యతారహితంగా సమాధానమిచ్చారు. కార్పొరేట్ సంస్థల ఇలాంటి మోసపూరిత ధోరణిపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కన్స్యూమర్ ఫోరమ్ను ఆశ్రయిస్తాం: పీడీఎస్యూ హెచ్చరిక...
ఖాతాదారుల జేబులకు చిల్లు పెడుతున్న మోర్ సూపర్ మార్కెట్ లైసెన్స్ను వెంటనే రద్దు చేయాలని పీడీఎస్యూ నేత ఖానాపురం రాజేష్ డిమాండ్ చేశారు. అమాయక ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేసిన రూ. 234 సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని వెంటనే వినియోగదారులకు తిరిగి చెల్లించాలన్నారు. లేనిపక్షంలో బాధితుల తరఫున కన్స్యూమర్ ఫోరమ్ (వినియోగదారుల ఫోరమ్)లో కేసు వేస్తామని, లీగల్ నోటీసులు పంపుతామని హెచ్చరించారు.
కార్పొరేట్ మోసాల్లో చిక్కుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక రైతుల దగ్గరే వస్తువులు కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని కోరారు. ఆదివారం మోర్లో షాపింగ్ చేసి మోసపోయిన ప్రతి ఒక్కరూ ముక్కుమ్మడిగా వచ్చి తమ అదనపు సొమ్మును రిటర్న్ తీసుకోవాలని, ఇందుకు పీడీఎస్యూ పూర్తి మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు.






