29-10-2025 01:54:08 PM
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): రైతుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ అన్నారు. బుధవారం సిర్పూర్ - టి మండలం టోకిని, పారిగాం, కౌటాల మండలం వెరవెల్లి, కుంబారి, గుడ్లబోరి, మండలం కోసిని, సీతానగర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ధాన్యం కొనుగోలు నిర్వహణ ప్రక్రియ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనలకు లోబడి రైతుల వద్ద నుండి ఆఖరు గింజ వరకు కొనుగోలు చేస్తుందని తెలిపారు. గ్రేడ్ ఏ రకానికి క్వింటాలుకు 2 వేల 389 రూపాయలు, సాధారణ రకానికి క్వింటాలుకు 2 వేల 369 రూపాయలుగా మద్దతు ధర నిర్ణయించడం జరిగిందని, సన్న రకం వడ్లకు క్వింటాలుకు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు అదనంగా అందించడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలని, కొనుగోలు చేసిన దాన్యం రక్షణ చర్యలు పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.