29-10-2025 03:49:32 PM
అమరావతి: మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసారు. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, బాపట్ల, కోడూరు, నాగాయలంక, కాట్రేనికోన, అంబాజీపేట, రాయవరం, ముదినేపల్లిలో ఏరియల్ సర్వే చేసారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల రేవు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించనున్నారు. రోడ్డు మార్గాన అల్లవరం మండలం బెండమూర్లంక చేరుకున్న సీఎం భారీ వర్షాలతో నేలకొరిగిన వరి పొలాలపై ఆరా తీయనున్నారు. విద్యుత్‌ను యుద్ధ ప్రతిపాదికన పునరుద్ధరించామని, ఈదురు గాలుల వల్ల భారీ నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో వరి, వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయని, తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పని చేశారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మొంథా తుఫాను కారణంగా సముద్రంపై వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం మత్స్యకారులకు చెప్పింది. అలాగే అప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి పిలిపించిందని, దీంతో గత 5 రోజులుగా మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారు. అందుకోసం ఆ కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.