అకాల వర్షంతో తడిసి ముద్దయిన వడ్లు
చేగుంట, ఏప్రిల్ 19: చేగుంట మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. చేగుంట, మక్కారాజ్ పేట్, చందాయిపేట్, పొలంపల్లి, పెద్ద శివనూర్ తో పాటు పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. కొన్ని ప్రాంతాల్లో తూకం వేసిన సంచులు ముద్దయ్యాయి. కుప్పల మీద రక్షణగా టార్ఫాలిన్లు కప్పినా భారీ వర్షంతో ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది.
పలు ప్రాంతాల్లో కోతకొచ్చిన వరి పొలాల్లోనే నేలకొరిగి, వడ్లు రాలిపోవడంతో కర్షకుల ఆరుగాలం శ్రమ వర్షార్పణమైంది. మక్కారాజ్ పేట్, చందాయిపేట్,గ్రామాల్లో గంటన్నర వరకు వాన రావడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట నీళ్ల పాలవుతుండటంతో రైతులు అందోళన చెందుతున్నారు. కాంట అయ్యే సమయానికి వరుణుడు కనుకరించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో, కేంద్రాల్లో పంట నష్టపోయిన వారిని ఆదుకోవాలని కోరుతున్నారు.






