05-12-2025 01:17:37 AM
కేసీఆర్ ఇంట్లో కాళేశ్వరం కనకవర్షం
* ఎర్ర బస్సు సైతం ఎరగని ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్ బస్సును తీసుకువస్తాం. మూతపడ్డ సిమెంట్ ఫ్యాక్టరీని త్వరలోనే పునరుద్ధరిస్తాం. జిల్లాకు యూనివర్సిటీ ఇస్తా.
సీఎం రేవంత్‌రెడ్డి
ఆదిలాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ‘రాష్ట్రానికి ఓ పెద్దాయన రూపంలో దయ్యం పట్టింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిలిపి వేసి.. కాళేశ్వరం పేరుతో అంచనాలు పెంచి నిర్మించారు. కానీ అది కూలేశ్వరంగా మారి మూడేళ్లలోనే కూలిపోయింది. కేసీఆర్ ఇంట్లో మాత్రం కనక వర్షం కురిసింది. రూ. లక్ష కోట్లు గోదావరి పాలైంది. సొమ్ము వచ్చిన తరవాత సొంత పిల్లలే కత్తులతో పొడుచుకుంటున్నారు. బిడ్డ, కొడుకు, అల్లుడు చెరో దిక్కు అయ్యారు.
కేసీఆర్ ఇంట్లో పైసల పంచాయితీ తప్పితే మరేది లేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజల సొమ్ము తింటే ఎవరూ బాగుపడరని పేర్కొన్నారు. ప్రాణహిత ప్రాజెక్టుకు టెండర్లు పిలిచామని అతి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌లో గురువారం ఆయన పర్యటించారు.
మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకట స్వామి, ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్‌రెడ్డి, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులతో కలిసి రూ.260.45 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. పట్టణ మహిళా సమాఖ్యలోని 160 స్వయం సహాయక సంఘాలకు రూ.19 కోట్ల 69 లక్షల 33 వేల రూపాయల బ్యాంకు రుణం చెక్కును సీఎం అందజేశారు. అనంతరం నిర్వహించిన ప్రజా విజయోత్సవ సభలో సీఎం ప్రసంగించారు.
50 రోజుల్లో 40 వేల ఉద్యోగ నియామకాలు
రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని.. రెండేళ్లలో కనీసం ఒక గంట కూడ సెలవు తీసుకోలేదని ముఖ్యమంత్రి చెప్పారు. అభివృద్ధి కి అందరిని కలుపుకొని వెళ్తున్నామని, పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో సీఎం సభలో ప్రతిపక్షాలు పాల్గొన్న సందర్భాలు లేవని.. పాల్గొన్న ఒక్క నిమిషం కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. ఈ నెలలోనే రైసింగ్-2047 గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, వంద దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సమ్మిట్‌కు తెలంగాణ ఆథిత్యం ఇస్తోందని తెలిపారు.
ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని, రాబోయే 50 రోజుల్లో మరో 40 వేల ఉద్యోగ నియామకాలు చేపడుతామన్నారు. యువత సర్పంచ్ పదవుల కోసం చూడకుండా ఉద్యోగాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌లో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారిని కలుపుకుని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి ని ముందుకు తీసుకెళ్లాంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడవాలన్నారు.
తనకు ఆదిలాబాద్ అంటే ఎంతో ఇష్టమని జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ఎర్ర బస్సు సైతం ఎరగని ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్ బస్సును తీసుకువస్తామ న్నారు. మూతపడ్డ సిమెంట్ ఫ్యాక్టరీని త్వరలోనే పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
జిల్లాకు యూనివర్సిటీ సైతం ఇస్తానాన్న సీఎం ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేయాలో ఇక్కడి నేతలు అందరూ మాట్లాడి నిర్ణయం తీసుకావాలని సూచించారు. తనకు మాత్రం పోరుగడ్డ ఇంద్రవెల్లిలో కుమ్రంభీం పేరుతో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే అభిప్రాయం ఉందన్నారు. చనాక కొరటా బ్యారేజ్ పనులను పూర్తి చేసి త్వరలో ప్రారంభిస్తామన్నారు.
ఏకగ్రీవాలకు ఒప్పించండి
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున గ్రామస్థులను సమన్వయం చేసుకొని ఏకగ్రీ వాలకు ఒప్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి నాయకులకు సూచించారు. మంచివాళ్లను సర్పంచులుగా ఎన్నుకోవాలని.. తాను నిధులు ఇస్తానని అభివృద్ధి చేసే భాద్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వినోద్, వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీలు దండే విట్టల్, మాజీ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, వేణుగోపాల చారి, ఇండియన్ ఆయిల్ ప్రతినిధి పూర్ణ చందర్, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, అధికారులు పాల్గొన్నారు.