15 April, 2026 | 10:36 AM

జీవనశైలి రుగ్మతలతో జాగ్రత్త!

28-12-2025 12:00 AM

ప్రపంచంలోనే మధుమేహ బాధితుల సంఖ్య భారత్‌లో అధికంగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. భారతీయులు నిత్యం తీసుకునే భోజనంలో అధిక కార్బో హైడ్రేట్లు, అతి తక్కువ ప్రోటీన్లు ఉండడం కారణంగానే దేశంలో మధుమేహం, స్థూలకాయం బారిన పడుతూ అనారోగ్యాల పాలవుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది. ఈ విషయాన్ని ‘ఐసీఎంఆర్  డయాబెటిస్’ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. నేడు దేశవ్యాప్తంగా 101 మిలియన్ల ప్రజలు మధుమేహ రుగ్మతతో, 136 మిలియన్ల ప్రజలు మధుమేహానికి దగ్గరగా (ప్రీడయాబెటిస్) ఉన్నట్లు తేల్చారు.

భారతీయుల్లో 11.4 శాతం ప్రజలు మధుమేహం గుప్పిట్లో, 15 శాతం మధుమేహానికి దగ్గరగా, 28.6 శాతం మంది స్థూలకాయ రుగ్మతలతో బాధపడడంతో పాటు బీపీ, డిస్‌లిపిడెమియా లాంటి జీవనశైలి రుగ్మతల బారిన పడుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు. భారతీయుల్లో 62 శాతం మంది పూర్-క్వాలిటీ (నాణ్యత కొరవడిన) కార్బోహైడ్రేట్ ఆహారాలను అధికంగా తీసుకుంటూ అతి తక్కువ మాంసకృత్తులను తీసుకుంటుండడంతో రానున్న రోజుల్లో అనారోగ్య సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదముందని హెచ్చరించింది.

భారతీయుల ఆహారంలో షుగర్, సంతృప్త కొవ్వులు అధికంగా ఉన్నాయని, దీనివల్ల పలు అసాంక్రమిక వ్యాధుల పెరిగే అవకాశమున్న ట్లు తెలుస్తోంది. మ ధుమేహం, స్థూలకా యం నివారణ మా ర్గాలు మన చేతిలోనే ఉన్నాయి. మనం తీసుకుంటున్న భోజనంలో కార్బోహైడ్రే ట్లను వీలైనంత వరకు తగ్గించి ప్రోటీన్లు అధికంగా ఉండే పప్పులు, గుడ్లు, పాల ఉత్పత్తులు, చేపలు, చికెన్ లాంటివి డైట్‌లో ఉంచుకునేలా ప్లాన్ చేసుకోవాలి. మాంసంను పూర్తిగా తగ్గించుకోవడం అవసరం. సాధారణంగా 15 నుంచి 20 శాతం వరకు ప్రోటీన్లు శరీరానికి అవసరం కాగా.. భారతీయులు కేవలం 12 శాతం వరకు మాత్రమే తీసుకుంటున్నారని ఐసీఎంఆర్ పేర్కొంది.

పప్పులు, చిక్కుళ్ళు, గుడ్లు, పాల ఉత్పత్తులు, చేపల్లో పీచు పదార్థాలు, సూక్ష్మపోషకాలు, తక్కువ గ్లుసైమిక్ సూచికలు ఉండడంతో ఇవి జీవనశైలి రుగ్మతలు తగ్గిస్తాయి. అంతేకాదు ప్రతిరోజు అధిక సార్లు తినడం మంచిది కాదని, రెండు సార్లు పోషకాహారం తీసుకుంటే సరిపోతుందని తెలుపుతున్నారు. ఇడ్లీలు, ఆలు పరాటాలు తగ్గించుకుంటూ పప్పు, చిక్కుళ్లను పెంచుకోవాలి. మన భోజన ప్లేట్‌లో ఏడు రంగులు (ఆకు కూరలు, క్యారెట్లు, బీట్‌రూట్, ఆకు పచ్చ, పప్పు, చిక్కుళ్ళు, చేపలు, పాలు లేదా పెరుగు) కలిగిన ఆహార పదార్థాలు మోతాదులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం తీసుకునే భోజనంలో నాణ్యతను పాటించాలి.

కార్బో హైడ్రేట్లను తగ్గించడం, ప్రోటీన్స్‌ను పెంచుకోవడం డైట్‌మెనూలో చేర్చుకోవాలి. ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలను తగ్గిద్దాం. వివిధ రకాల సీజనల్ పండ్లను తినడం అలవాటు చేసుకుందాం. మన భోజనంలో తెల్లటి ఆహార పదార్థాలను తక్కువగా, ఇంద్రధనుస్సు రంగులు పళ్లెంలో ఉండే విధంగా చూసుకుందాం. ఆరోగ్య ప్రదాతలైన సమతుల పోషకాహారాన్ని తీసుకోవడాన్ని అలవాటుగా చేసుకుందాం. మనం తీసుకునే భోజనమే మన ఆరోగ్యాన్ని శాసిస్తుంది, అదుపు తప్పితే జీవనశైలి రుగ్మతల విష వలయంలోకి నెట్టేస్తుంది. అన్నం తక్కువ కూరలు ఎక్కువ తిందాం. మన ఆరోగ్యాని అదుపులో ఉంచుకుందాం. 

 వ్యాసకర్త సెల్, బుర్ర మధుసూదన్ రెడ్డి : 9949700037