27 July, 2026 | 1:57 AM

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఒక్క ఓటు కోల్పోకూడదు

27-07-2026 01:22 AM

నిర్మల్, జులై 26 (విజయక్రాంతి): పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు ఓటు అని, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా బూత్ లెవల్ సూపర్వైజర్లు (బీఎల్‌ఎస్), బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) అప్రమత్తంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో బీఎల్‌ఎస్, బీఎల్‌ఏలతో సమావేశం నిర్వహించారు.

ప్రతి ఓటును కీలకంగా భావించి ప్రతి ఓటరు వద్దకు వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను నింపించి, బూత్ లెవల్ అధికారికి సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్‌ఐర్ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా అన్యాయంగా తొలగించబడకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి అర్హత ఓటరు వివరాలను నమోదు చేసి ఆన్లైన్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేసేలా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు గాజుల రవికుమార్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, బీఎల్‌ఎస్, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.