15 April, 2026 | 6:17 PM

మా ప్రాజెక్టు గాలికి.. మా నీళ్లు నల్లగొండకు..?

15-04-2026 03:12 PM
  1. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి కలలు కల్లలే.. 
  2. కాంగ్రెస్ వచ్చాక కూడా అదే పరిస్థితి.. 
  3. పాలమూరు ప్రాజెక్టుల ఉద్యమ వేదిక చైర్మన్ రాజేందర్ రెడ్డి,
  4. పాలమూరు ఉద్యమ వేదిక కన్వీనర్ రాఘవులు రాజేందర్ 

షాద్‌నగర్ ఏప్రిల్ 15 (విజయక్రాంతి): “మా ప్రాజెక్టు గాలికి వదిలేసి… మా నీళ్లను నల్లగొండకు మళ్లించడం ఏ న్యాయం?” అంటూ పాలమూరు ఉద్యమ వేదిక చైర్మన్ రాజేందర్ రెడ్డి, కన్వీనర్ రాఘవులు రాజేందర్, టీ జీ శ్రీనివాస్ మండిపడ్డారు. బుధవారం షాద్ నగర్ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఉద్యమ వేదిక చైర్మన్ రాజేందర్ రెడ్డి, కన్వీనర్ రాఘవులు రాజేందర్, టీ జీ శ్రీనివాస్ ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ హయాంలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అత్యంత నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా పరిస్థితిలో మార్పు లేకపోవడం దారుణమని ఆరోపించారు.

90 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పడం పూర్తిగా అబద్ధం… 10 శాతం కూడా పూర్తి కాలేదు” అంటూ పార్టీల వాదనలను తిప్పికొట్టారు. దిండి, దుందుభి నదుల ద్వారా పాలమూరు జిల్లా నీటిని నల్లగొండకు తరలించడం తీవ్ర అన్యాయం అని మండిపడ్డారు. పాలమూరుకు నీళ్లు ఇవ్వకుండా, ఇతర జిల్లాలకు మళ్లించడం ప్రజలను మోసం చేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. షాద్‌నగర్ నియోజకవర్గ ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు ఇప్పటివరకు ప్రారంభం కానందుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థల పరిశీలన చేసినా పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పారని గుర్తు చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై దృష్టి సారించి పాలమూరును పక్కన పెట్టారని విమర్శించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు పాలమూరు కీలక పాత్ర పోషించినా… ఇప్పటివరకు ప్రాజెక్టులపై శ్రద్ధ చూపకపోవడం మరింత నిరాశ కలిగించిందన్నారు.

''మరో ఉద్యమం తప్పదు!”

పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే తెలంగాణ ఉద్యమంలా మరోసారి భారీ స్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పాలమూరు ప్రాజెక్టు సాధించే వరకు పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వెంటనే స్పందించి ప్రాజెక్టులపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రత్యేకంగా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌పై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.