08-12-2025 05:41:18 PM
కోనరావుపేట (విజయక్రాంతి): కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సుద్దాల గ్రామంలో ఎన్నికల అవగాహన కార్యక్రమాన్ని ఎస్‌ఐ కె. ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ప్రతి ఓటరు తన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ప్రజలు అనుసరించాల్సిన ప్రవర్తనా నియమావళి, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పాత్రను వివరించారు.
ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలంతా పోలీసులకు సహకరించాలన్నారు. ఎలాంటి గొడవలు లేదా పార్టీ తగాదాల్లో పాల్గొని ఇబ్బందులు పడవద్దని హెచ్చరించారు. శాంతి భద్రతలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.