calender_icon.png 8 December, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి

08-12-2025 05:39:25 PM

జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్

గద్వాల: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు తమ సొంత మండలాల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అన్నారు. మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు సోమవారం ధరూర్, కేటీ దొడ్డి మండలాల ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ కు ఆయా మండలాలకు చెందిన ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారని, వారికిచ్చిన ఫామ్ 14 లో వివరాలను పరిశీలించారు.

హెల్ప్ డెస్క్ వద్ద సిబ్బందితో మాట్లాడి తగు సూచనలు చేశారు. పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకొని వినియోగించుకోని వారి వివరాలను, ఎంతమంది వినియోగించుకున్నారో వివరాలు నమోదు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను దగ్గరుండి పరిశీలించారు. ఆయా గ్రామ పంచాయతీల ఓటరు జాబితాలో పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు వచ్చిన వారి వివరాలు సరిచూసుకోవాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ బాక్స్ కు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీలు వేశారా అని అధికారులను అడిగారు. పోస్టల్ బ్యాలెట్ విధులు నిర్వహించే సిబ్బంది పనితీరును దగ్గరుండి పరిశీలించారు. ఎలక్ట్రోరల్ తప్పనిసరిగా మానిటరింగ్ చేసుకోవాలన్నారు ఆయా గ్రామ పంచాయతీల వారీగా బ్యాలెట్ పేపర్లలో వార్డు సభ్యుల, సర్పంచి అభ్యర్థుల వివరాలను చూశారు.

పోస్టల్ బ్యాలెట్స్ ప్రక్రియ పూర్తయ్యాక  ఆయా గ్రామ పంచాయతీల వారీగా వచ్చిన పోస్టల్ బ్యాలెట్స్ ను సంబంధిత ప్రిసైడింగ్ అధికారులకు అప్పగించాలన్నారు. అనంతరం కేటీ దొడ్డి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. బ్యాలెట్ పేపర్స్ ముద్రణలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని అక్కడి అధికారులను ఆదేశించారు. బ్యాలెట్ బాక్స్ లు, వివిధ పోలింగ్ ఫామ్స్, తదితర సామాగ్రిని పరిశీలించారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఎన్నికల ప్రవర్తన నియమావళి జిల్లా మానిటరింగ్ అధికారి శ్రీనివాసరావు, ఆయా మండలాల ఎంపీడీవో లు కృష్ణమోహన్, రమణారావు, తహసిల్దార్ లు నరేందర్, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.