పంచాయతీ కార్యదర్శి విధులకు డుమ్మా.!
డెత్ సర్టిఫికెట్ల జారీలో అవకతవకలపై విచారణ తర్వాత గైర్హాజరు?
కొత్త పింఛన్ల దరఖాస్తుదారులకు తప్పని ఇబ్బందులు
ఈనెల 31తో ముగియనున్న దరఖాస్తుల స్వీకరణ గడువు
అచ్చంపేట, ఆగస్టు 27: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లి పంచాయతీ కార్యదర్శి రమేష్బాబు కొద్ది రోజులుగా విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో పంచాయతీ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు.
గ్రామంలో కొందరు మృతి చెందిన వ్యక్తులకు సంబంధించి డెత్ సర్టిఫికెట్ల జారీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒకే వ్యక్తి రెండు, మూడు సార్లు వేర్వేరు సంవత్సరాల్లో మృతి చెందినట్లుగా డెత్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు.
ఈ వ్యవహారంపై పత్రికల్లో కథనాలు ప్రచురితం కావడంతో జులై 13న అచ్చంపేట డీఎల్పీవో వెంకట ప్రసాద్ బొమ్మనపల్లి గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. కాగా విచారణ జరిగిన మరుసటి రోజు నుంచే పంచాయతీ కార్యదర్శి విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో పంచాయతీ కార్యాలయంలో సాధారణ పరిపాలనా పనులతో పాటు వివిధ ధ్రువపత్రాల కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు.
పింఛన్ల దరఖాస్తుదారుల అవస్థలు
ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 31 వరకు గడువు విధించింది. ఈ నేపథ్యంలో అర్హత ఉన్న పలువురు గ్రామస్థులు దరఖాస్తులు సమర్పించేందుకు పంచాయతీ కార్యాలయానికి వస్తున్నారు. అయితే కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో దరఖాస్తుల ప్రక్రియలో జాప్యం జరుగుతోందని గ్రామస్తులు వాపోతున్నారు. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు స్పందించి పంచాయతీ కార్యదర్శి విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంపై గతంలో చేపట్టిన విచారణలో ఏం తేలింది? కార్యదర్శి విధులకు ఎందుకు గైర్హాజరవుతున్నారు? ఆయనపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
విధులకు హాజరవుతున్నా.. పంచాయతీ కార్యదర్శి
విధులకు గైర్హాజరవుతున్నానని ఆరోపణలో వాస్తవం లేదని పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు. రెండు రోజులుగా ఎంపీడీవో కార్యాలయంలో ఉండి పింఛన్ దరఖాస్తులను ఆన్లైన్ చేపిస్తున్నానని చెప్పారు. అలాగే కొద్ది రోజులు సెలవులో ఉండడంతో అందరూ డ్యూటీకి రావడం లేదని అనుకుంటున్నారని అదంతా అబద్ధమని చెప్పారు.






