15 August, 2026 | 3:40 AM

పండగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలి

15-08-2026 12:40 AM

సీఎం రేవంత్ రెడ్డితో ప్రజా ప్రతినిధుల భేటీ 

పటాన్ చెరు, ఆగస్టు 14: తెలంగాణ సమాజంలో నిజాం నిరంకుశత్వానికి, భూస్వామ్య వ్యవస్థ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి, ఆకలితో అలమటించే నిరుపేదల కడుపు నింపిన బహుజన వీరుడు తెలంగాణ రాబిన్ హుడ్ ‘పండగ సాయన్న’ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ సామాజికవర్గ ప్రజాప్రతినిధులు, అగ్రనేతలు, కుల సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు మంత్రివర్యులు వాకిటి శ్రీహరి, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్, మాజీ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ తదితర నాయకులు సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిసి ప్రత్యేకంగా వినతిపత్రం సమర్పించారు. ఈ భేటీ సందర్భంగా తెలంగాణ ఉద్యమ చరిత్రలో, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవ పోరాటంలో పండగ సాయన్న సేవలను సీఎం రేవంత్ రెడ్డికి నేతలు వివరించారు.

చారిత్రక ఆధారాలతో ప్రతి ఏటా అక్టోబర్ 22వ తేదీన పండగ సాయన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇస్తూ అతిత్వరలో జీవో విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సీఎం తీసుకున్నఈ చారిత్రాత్మక నిర్ణయం పట్ల మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్  హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పరి శంకర్, మహబూబ్ నగర్ డీసీసీ సంజీవ్, ఖైరతాబాద్ డీసీసీ మోత రోహిత్, గుండ్లపల్లి శ్రీనివాస్, అల్లుడు జగన్, పిట్ల నగేష్, మద్దెల సంతోష్, మహేష్ సుంకరబోయిన, సాయన్న సేవాసమితి కృష్ణ. బలరాం, రాజశేఖర్, బక్క జనార్దన్, భీమ్ లక్ష్మణ్, పండగ బాలు, ఆగం పాండు, నిజ్జల రమేష్, ముదిరాజ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.