18 July, 2026 | 6:59 PM

Breaking News

నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •  

రాజకీయాలకు పాండియన్ గుడ్‌బై

10-06-2024 02:15 AM

బీజేడీ ఓటమితో నవీన్ ఆంతరంగికుడి కీలక నిర్ణయం

క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల

భువనేశ్వర్, జూన్ 9: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒడిశా రాజకీయాల్లో పెను మార్పులకు కారణమవుతున్నాయి. 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేడీ అనూహ్యంగా ఓటమిపాలు కావడంతో మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఆంతరంగికుడు, ఆ పార్టీ కీలక నేత వీకే పాండియన్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు పార్టీకి, కార్యకర్తలకు క్షమాపణలు చెబుతూ ఓ వీడియో విదుడల చేశారు.

నేను రాజకీయాల్లోకి వచ్చింది నవీన్ పట్నాయక్‌కు సాయం చేసేందుకే. ఇప్పుడు నేను క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగాలని భావిస్తున్నా. నా ప్రయాణంలో ఎవరినైనా బాధిస్తే క్షమించండి. ఒకవేళ నాపై జరిగిన ప్రచారం వల్ల బీజేడీ ఓడిపోవాల్సి వచ్చిందని ఎవరైనా భావిస్తే అందుకు కూడా క్షమించండి. నాతో కలిసి పనిచేసిన లక్షలాది మంది బీజేడీ కార్యకర్తలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా గురువు నవీన్‌ను నిత్యం గుండెల్లో ఉంచుకుంటా. వారి శ్రేయస్సు కోసం జగన్నాథుడిని ప్రార్థిస్తున్నా అని వీడియోలో పేర్కొన్నారు.   

నవీన్ వారసుడని ప్రచారం..

ఎన్నికల ప్రచారంలో భాగంగా పాండియన్‌పై బీజేపీ విమర్శలు చేసింది. నవీన్ ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల్లో బీజేడీ గెలిస్తే నవీన్ వారసుడు పాండియన్ ముఖ్యమంత్రి అవుతారని ఆరోపించారు. పాండియన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి కావడంతో ఈ ప్రచారం ఒడిశాలో కొంత ప్రభావం చూపినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆరోపణలను నవీన్ ఖండించారు. పాండియన్ తన కోసం పనిచేశారు తప్పితే ఎప్పుడూ ఏ పదవి అనుభవించలేదని తెలిపారు. ఎన్నికల్లోనూ పోటీ చేయలేదని గుర్తు చేశారు. పాండియన్ తన వారసుడు ఎప్పటికీ కాలేరని ఇప్పటికే చాలాసార్లు నవీన్ స్పష్టం చేశారు.