12 May, 2026 | 12:48 PM

పారాలింపిక్స్ మరో పోటీ మాత్రమే

24-08-2024 12:30 AM

పారా షూటర్ అవనీ లేఖరా

న్యూఢిల్లీ: పారాలింపిక్స్ అనేది తన దృష్టిలో ఒక పోటీ మాత్రమేనని భారత పారా షూటర్ అవనీ లేఖరా అభిప్రాయపడింది.  ఈవెంట్ ఏదైనా పోటీగానే పరిగణిస్తానన్న అవనీ టెక్నిక్‌ను మరింత మెరుగుపరుచుకున్నట్లు తెలిపింది. అవనీ మాట్లాడుతూ.. ‘పారిస్ పారాలింపిక్స్‌కు సానుకూల దృక్పథంతో సిద్ధమ వుతున్నాం. మా ఫోకస్ మొత్తం ఆటపైనే ఉంటుంది.. పతకాల గురించి ఎప్పుడు ఆలోచించం. టోక్యోలో పతకాలు సాధించినప్పటికీ నాలో లోపాలు కనిపించాయి.

ఈసారి సరికొత్త టెక్నిక్‌తో ఆ లోపాలను సరిదిద్దుకోనున్నా. పారాలింపిక్స్ లేక వరల్డ్‌కప్ ఏదైనా నా దృష్టిలో పోటీ మాత్రమే. ప్రాక్టీస్‌లో నేర్చుకున్న దానిని అమలుపర్చాలి. ఫలితం ఉత్తమంగా ఉంటే పతకాలు వెతుక్కుంటూ వస్తాయి’ అని పేర్కొంది. టోక్యో పారాలింపిక్స్‌లో అవనీ ఎస్‌హెచ్1 కేటగిరీ 10 మీటర్ల రైఫిల్‌లో స్వర్ణంతో పాటు 50 మీ రైఫిల్ పొజిషన్‌లో కాంస్యం దక్కించుకుంది.  ఈ ఏడాది మార్చిలో పారా షూటింగ్ వరల్డ్‌కప్ ముగిసిన అనంతరం గాల్‌బ్లాడర్ సర్జరీ చేయించుకున్న అవనీ లేఖరా పూర్తి స్థాయిలో కోలుకొని పారాలింపిక్స్‌కు సిద్ధమవుతోంది. 

11 ఏళ్ల వయసులో కార్ యాక్సిడెంట్‌కు గురైన అవనీకి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. 2015లో జైపూర్‌లో షూటింగ్‌లో శిక్షణ తీసుకున్న అవనీ 2022 పారా షూటింగ్ ప్రపంచకప్‌తో పాటు పారా ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాలు గెలుచుకుంది. 2023లో వరల్డ్ షూటింగ్ పారా స్పోర్ట్స్ ర్యాంకింగ్స్‌లో అవనీ నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించింది.