తల్లిదండ్రుల వాదన వినాల్సిందే
వివాహ రిజిస్ట్రేషన్ విషయంలో హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): వివాహ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్‌కు ఏవైనా ఉత్తర్వులు జారీ చేయాలంటే ముందుగా తల్లిదండ్రుల వాదన వినాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. వారి వాదన వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. పిటిషన్‌లో తల్లిదండ్రులు ప్రతివాదులు కాకపోయినా ఇతరుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకునే విచక్షణాధికారం హైకోర్టుకు ఉందని పేర్కొంది. వివాహం రిజిస్ట్రేషన్‌కు తల్లిదండ్రుల సంతకం కావాలన్న సబ్‌రిజిస్ట్రార్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన వైదేహి, యూసఫ్‌గూడకు చెందిన యూసఫ్ నజీబుద్దీన్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
వేర్వేరు మతాలకు చెందిన పిటిషనర్లు కాలేజీ రోజుల నుంచి ప్రేమించు కుంటూ ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలని భావించారు. వివాహానికి యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో సబ్‌రిజి స్ట్రార్ కార్యాలయంలో మార్చి 13న దరఖాస్తు చేసుకోగా అదే రోజు నోటీసు జారీ అయిందన్నారు. అభ్యంతరాలుంటే చెప్పడానికి వీలుగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం లోనే నోటీసు పెట్టినట్లు తెలిపారు. జూన్ 1న రిజిస్ట్రేషన్‌కు వెళ్లగా యువతి తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏప్రిల్ 4న లేఖ ఇచ్చినట్లు తెలిసిందన్నారు. పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ముస్లిం అని, అంతేగాకుండా ఎలాంటి ఆదాయం లేనందున వివాహానికి అనుమతించరాదని అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. పిటిషనర్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండా తల్లిదండ్రులు సంతకం చేయాల్సి ఉందంటూ రిజిస్ట్రేషన్‌కు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి యువతి తల్లిదండ్రుల వాదన వినాల్సి ఉందని ఈనెల 27వ తేదీకి వాయిదా వేశారు.






