ప్రియాంక, ఆకాశ్‌కు పారిస్ బెర్త్
22-04-2024 01:07 AM
ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వాకర్స్
అంటల్యా (టర్కీ): భారత రేస్ వాకర్లు ఆకాశ్‌దీప్ సింగ్, ప్రియాంక గోస్వామి ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. విశ్వ క్రీడల్లో ఈ జోడి మిక్స్‌డ్ రిలే ఈవెంట్‌లో బరిలోకి దిగనుంది. ఆదివారం ప్రపంచ అథ్లెటిక్స్ రేస్ వాకింగ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో 18వ స్థానంలో నిలువడం ద్వారా ఆకాశ్ ద్వయం ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకుంది. తాజా రేస్‌లో 42.195 కిలోమీటర్ల దూరాన్ని భారత వాకర్లు 3 గంటల 5 నిమిషాల 3 సెకన్లలో పూర్తి చేశారు. ఆకాశ్ ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం మరో విశేషం. ఈ పోటీల్లో 22వ స్థానం వరకు నిలిచిన అథ్లెట్లు నేరుగా పారిస్ క్రీడలకు ఎంపికయ్యే అవకాశం ఉండగా.. మనవాళ్లు అంతకన్నా మెరుగైన ప్రదర్శనతో ఒలింపిక్ టికెట్ పట్టేశారు. ఇక ఈ టోర్నీ విషయానికి వస్తే ఇటలీకి చెందిన జంట ఫ్రాన్సెస్కో ఫోర్చునాటా ట్రాప్లెటి (2 గంటల 56 నిమిషాల 45 సెకన్లు) స్వర్ణం సాధించింది.
మిక్స్‌డ్ రిలే వాక్ అంటే..
మిక్స్‌డ్ రిలే వాక్‌లో ఓ పురుష అథ్లెట్, ఓ మహిళా అథ్లెట్ కలిసి 42.195 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. తొలుత పురుష వాకర్ 12.195 కిలోమీటర్లు నడిచిన అనంతరం మహిళా అథ్లెట్ 10 కిలోమీటర్లు, ఆ తర్వాత పురుష అథ్లెట్ మరో పది కిలోమీటర్లు, చివరకు మహిళా అథ్లెట్ పది కిలోమీటర్లు పూర్తి చేయాలి.






