రాజస్థాన్ X ముంబై
జైపూర్: ఐపీఎల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న రాజస్థాన్ రాయల్స్.. సోమవారం ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. సీజన్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట నెగ్గిన రాజస్థాన్.. ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువవ్వాలని చూస్తుంటే.. గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన ముంబై.. మరోసారి సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. రాజస్థాన్ తరఫున కెప్టెన్ సంజూ శాంసన్ (276 పరుగులు), రియాన్ పరాగ్ (318 పరుగులు), జోస్ బట్లర్ (250 పరుగులు) మంచి జోష్ మీద ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటింగ్‌కు ముంబై బౌలింగ్‌కు మధ్య టఫ్ ఫైట్ కనిపించే చాన్స్ ఉంది. లీగ్‌లో ఇప్పటి వరకు 13 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ తన వద్ద పెట్టుకున్న బుమ్రాను రాయల్స్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేదానిపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, డేవిడ్‌తో ముంబై బ్యాటింగ్ లైనప్ కూడా శత్రు దుర్బేధ్యంగా ఉన్నా.. వీరంత సమిష్టిగా సత్తాచాటితేనే పాండ్యా సేన భారీ స్కోరు చేయగలదు. బౌల్ట్, అవేవ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్‌తో కూడిన రాజస్థాన్ బౌలింగ్ కూడా పదునుగానే కనిపిస్తోంది. ఇరు జట్ల మధ్య చివరగా జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది. మరి ఈ సారి ముంబై లెక్క సరిచేస్తుందా చూడాలి!






