3 April, 2026 | 2:54 AM

అమరావతికి పార్లమెంట్ ఆమోదం

03-04-2026 01:12 AM
  1. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిత్యానందరాయ్

బిల్లుకు 10 పార్టీల మద్దతు.. వ్యతిరేకించిన వైఎస్సార్ సీపీ

మూజువాణి ఓటుతో ఆమోదం

ఈ చట్టం ఏపీ అభివృద్ధికి నాంది పలకాలి

రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన అమరావతి చట్టబద్ధత బిల్లుకు గురువారం రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. చర్చను ఎంపీ రేణుకాచౌదరి ప్రారంభించారు. సభ్యులందరి మద్దతుతో మూజువాణి ఓటు ద్వారా బిల్లు ఆమోదం పొందింది.

ఈ పరిణామంతో అమరావతి చట్ట బద్ధత బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదముద్ర పడింది.మొత్తం 11 పార్టీలకు చెందిన 17 మంది ఎంపీలు ఈ చర్చలో పాల్గొన్నారు. ఇందులో 10 పార్టీలు బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. వైఎస్సార్ సీపీ సభ్యులు మాత్రం ఈ బిల్లును వ్యతిరేకించారు. ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ అమరావతిని తమ పార్టీ ఏనాడు వ్యతిరేకించలేదని, అయితే ఈ బిల్లులో అనేక అంశాలపై స్పష్టతలేదని అన్నారు.

రైతుల నుంచి 50 వేల ఎకరాలు సేకరించినా ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. మౌలిక వసతులకే రూ.2లక్షల కోట్లు అవుతుందని పేర్కొన్నారు. అనంతరం అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

అమరావతికి ఆ శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈ చట్టం ఏపీ అభివృద్ధికి నాంది పలకాలి అని ఆయన ఆకాంక్షించారు.పార్లమెంటులోని ఉభయ సభలు ఆమోదించిన నేపథ్యంలో, ఇప్పుడు ఈ బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. రాష్ట్రపతి సంతకంతో ఇది అధికారికంగా చట్టంగా మారుతుంది. 

రైతులదే విజయం: రేణుకా చౌదరి

ఏపీ రాజధాని బిల్లు అమరావతి రైతుల విజయమని రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి పేర్కొన్నారు. గురువారం రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ఉద్యమ సమయంలో రైతులు, మహిళలను తీవ్రంగా హింసించినా, వారు వెనకడుగు వేయకుండా పోరాటం కొనసాగించారని గుర్తుచేశారు.ఏపీ రాజధానిపై పన్నెండేళ్లుగా అస్పష్టత ఉంది.

దీంతో పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి అన్నారు. మాజీ సీఎం జగన్ మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశారని ఆమె విమర్శించారు. కేవలం బిల్లు పెట్టడమే కాదు, నిర్ణీత సమయంలో రాజధానిని పూర్తి చేసి చూపించాలని డిమాండ్ చేశారు. కాగా విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదన్నారు.ఇప్పటి వరకు కూడా ఆస్తుల పంపకం పూర్తి కాలేదన్నారు. కేంద్రం విభజన హామీలనీ నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు.

పూర్తి మద్దతు ఇస్తున్నాం: ఆర్ కృష్ణయ్య

ఏపీ రాజధానిగా అమరావతికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. రాష్ట్రం మధ్యలో అమరావతి ఉంటుందని, పాలనాపరంగా సౌలభ్యంగా ఉంటుందని అన్నారు.అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ రాజధానిగా అమరావతి అభివృద్ధి అవశ్యమని, దీనిని రాజకీయ కోణంలో చూసి విమర్శలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని అన్నారు. నిధులు సమకూరుస్తున్నట్లు చెప్పారు.బలహీనవర్గాల రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుందన్న నమ్మకం ఉందని ఆర్ కృష్ణయ్య అన్నారు.రాజధాని అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేశారని అన్నారు.చంద్రబాబు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడాన్ని మనం చూశామని, అలాగే అమరావతిని అభివృద్ధి చేయాలనే తపన ప్రధాని మోదీకి కూడా ఉందని అన్నారు.  

రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీయే కట్టుబడి ఉంది: లక్ష్మణ్

రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీయే కట్టుబడి ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పం సాకారమయ్యేందుకు వికసిత్ ఆంధ్ర నిర్మాణం అవశ్యమన్నారు. దూరదృష్టి గల నాయకుడిగా ఆనాడు హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబునాయుడు కృషి చేశారని, విభజన తర్వాత ఏపీకి అమరావతి రాజధానిగా సంకల్పం తీసుకుని ముందుకు సాగుతున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు.

రాజధాని అమరావతి కోసం 29 వేలమంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారన్నారు. భవ్య రాజధాని కోసం ఏపీ ప్రజలు కలలు కన్నారని అన్నారు. రాజధాని అవసరమని, కానీ జగన్ తన హయాంలో మూడు ముక్కలాట ఆడారని లక్ష్మణ్ ఆరోపించారు. రాజధాని కోసం పోరాడిన మహిళలకు, రైతులకు ఆయన శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. అమరావతి బిల్లు కోసం దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోందని అన్నారు.

తెలుగు వారికి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కావాలని నాడు పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేసినా, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన ప్రాణాలు త్యాగం చేశారని అన్నారు. ఆయన మరణానంతరం ప్రభుత్వం స్పందించి ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిందని అన్నారు.