5 June, 2026 | 1:12 AM

తెలంగాణపై పవన్ కల్యాణ్ విద్వేషం

05-06-2026 12:00 AM

బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు ఆరోపణ

ముషీరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): తెలంగాణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మొదటి నుంచి విద్వేషం ఉందని బీసీ ఇంటెలెక్చ్యువల్ ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు ఆరోపించారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ ఇంటెలెక్చ్యువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ముమ్మాటికీ తెలంగాణ ప్రజలదేనని, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అగ్రకుల రాజకీయ శక్తులు ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ, టీడీపీ ఉన్నాయని ఆరోపించారు. బీసీలను అణిచివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో బీసీ ఉద్యమం ప్రారంభమైందని, ఎలాంటి కుయుక్తులు పన్నినా ఆ ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.

రాబోయే 2029 ఎన్నికల్లో బహుజన రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్, వైస్ చైర్మన్ ఎస్.దుర్గగౌడ్, కన్వీనర్లు అయిలి వెంకన్నగౌడ్, ఎలికట్టే విజయ్‌కుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్‌లు,బీసీ నాయకులు బైరి శేఖర్, పొన్నం నారాయణ, లింగేష్ యాదవ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.