చేతి చమురు వదులుతోంది!
స్కాముల కేసుల విచారణకు భారీగా ఖర్చు
సీనియర్ న్యాయవాదులకే రూ.కోట్లల్లో చెల్లింపు
100 కోట్ల లిక్కర్ స్కాం విచారణ ఖర్చు రూ.100 కోట్లు?
వందల మంది అధికారులు, సిబ్బంది శ్రమ వృథా
అంతిమంగా రాజకీయ నాయకులకే పేరు, ఖ్యాతి
విచారణ తీరుపై పెదవి విరుస్తున్న సామాన్యులు
హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాం తి): లిక్కర్ స్కాం.. ఈ ఏడాది దేశ ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షించిన కేసు. రూ. 1౦౦ కోట్ల విలువైన ఈ స్కామ్ విచారణ ప్రారంభమై.. నేతలకు బెయిల్ వచ్చేవరకే రూ.౧౦౦ కోట్లు చేతి చమురు వదిలి ఉండొచ్చని చర్చ సాగుతోంది. దేశంలో ఇలాంటి కేసులు కోకోల్లలుగా ఉన్నాయి. స్కాముల్లో చిక్కుకున్న రాజకీయ నేతల విచారణకు భారీగా ఖర్చు పెడుతున్నారని, అంతిమంగా రాజకీయ నాయకులకే పేరు, ప్రచారం దక్కుతుందని సామాన్యుల నుంచి అసంతృప్తి వెల్లడవుతుంది.
న్యాయవాదులకే భారీ చెల్లింపులు
దాదాపు ౧౦ నెలల కాలంగా జరుగుతు న్న లిక్కర్ స్కామ్ విషయమే తీసుకుంటే దేశంలోనే పేరున్న పెద్దపెద్ద న్యాయవాదులు, సుప్రీంకోర్టు అడ్వొకేట్లు ఈ కేసు విచారణ సందర్భంగా నిందితుల తరఫున హాజరై అనేకసార్లు వాదనలు విన్పించారు. ఆ స్థాయి న్యాయవాదులు వాదించడానికి భారీగానే ఫీజుల రూపంలో చెల్లించాల్సి ఉంటుందనేది తెలిసిందే. ఒక్కో న్యాయవాది తాను వాదించే కేసు ను బట్టి రూ.లక్షల్లో ఫీజుగా తీసుకుంటారు. ఈ లెక్కన ఇలా వాదనలు విన్పించడానికే రూ.కోట్లలో ఖర్చు చేసే అవకాశాన్ని తీసిపారేయలేం.
భారీగా అధికారులు.. సిబ్బంది
సంచలనాత్మక కేసుల్లో విచారణ, దర్యాప్తునకు అంతే స్థాయిలో సిబ్బంది, సాం కేతికత, పరిశోధన కూడా అవసరం. ఈడీ, సీబీఐలాంటి జాతీయ దర్యాప్తు సంస్థలు.. ఇలాంటి సంచలన కేసులను విచారించేందుకు భారీగా అధికారులు, సిబ్బంది, వాహ నాలను ఉపయోగించక తప్పని పరిస్థితి. లిక్కర్ స్కాం కేసు విచారణ కోసం దాదాపు 400 మందిని వినియోగించాల్సి వచ్చిందని సమాచారం. ఇలా చూసుకున్నా రూ.కోట్ల లో ఖర్చు అవుతుందని చెప్పుకోవచ్చు. రాజకీయ నేతలపై విచారణకు, వారి అనుయా యులు, కార్యకర్తల హడావుడికి, రవాణా, బస చేయడానికి ఖర్చుల రూపంలోనూ భారీగానే వెచ్చించాల్సి ఉంటుంది. ఏవిధంగా చూసినా.. కేసు విచారణ ముగియ డం అటుంచి.. బెయిల్ వచ్చేనాటికే ఖర్చులన్నీ కలిపి తడిసి మోపడయ్యేలా కనిపి స్తోంది. రూ.వంద కోట్ల స్కాంలో విచారణకు ఖర్చు వంద కోట్లు దాటి ఉండవచ్చని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి.
చివరికి నేతలకే ప్రచారం
ఒక స్కాం విచారణ పూర్తయ్యే సరికి ఏళ్లు పడుతోంది. విచారణను ఎదుర్కొంటున్న రాజకీయ నేతల అరెస్టు, విడుదల, బెయిల్.. చివరికి వారికి సంబంధం ఉందనో.. లేదనో కోర్టు చెప్పే తీర్పు వరకు చూసుకుంటే.. స్కాం విషయం అటుంచి ఈ వ్యవహారంలో రాజకీయ నేతల హంగూ, ఆర్భాటాలతో అంతిమంగా వారికే పేరు తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు. కేసుల విచారణ పేరుతో అధికారులు, రాజకీయ నేతల మధ్యన జరు గుతున్న ప్రక్రియ చివరకు సదరు నేతల పై ప్రజల్లో మరింత క్రేజీని పెంచుతోంది. అందుకే వీలైనంత మేరకు నేతలు.. ఆయా స్కాంలలో అరెస్టు, విడుదల, బెయిల్ లాంటి అంశాల్లో హంగామా చేస్తూ ప్రజల్లో క్రేజీని కూడగట్టుకునేలా వ్యవహరిస్తున్నారు. కేసుల విచారణ ప్రక్రియలో దోషుల నిర్దారణ సంగతేమోగానీ సదరు నాయకులకు దేశవ్యాప్త ప్రచారం వస్తుందనడంలో అతిశయోక్తి లేదు.






