దాడులకు పాల్పడుతున్న నిందితుడిపై పీడీ యాక్ట్
చర్లపల్లి జైలుకు తరలింపు..
ఉట్నూర్ సీఐ మడవి ప్రసాద్..
ఉట్నూర్, ఆగస్టు 5 : ప్రజలను బెదిరించడం, రౌడీయిజానికి పాల్పడడం, మోసాలు చేయడం, దాడులు నిర్వహించడం వంటి పలు నేరాలకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న జవాడే గోపాల్ అలియాస్ జాదవ్ గోపాల్ (37)పై పీడీ యాక్ట్ (ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్) నమోదు చేసి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించినట్లు ఉట్నూర్ సీఐ మడవి ప్రసాద్ బుధవారం తెలిపారు.
గోపాల్ పై ఇప్పటివరకు బెదిరింపులు, రౌడీయిజం, మోసాలు, దోపిడీలు, దాడులు తదితర నేరాలకు సంబంధించి మొత్తం 16 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అయినా తన నేరపూరిత కార్యకలాపాలను కొనసాగిస్తూ ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రతను పరిరక్షించేందుకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిఫార్సు మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వెల్లడించారు. పీడీ యాక్ట్ అమలు అనంతరం నిందితుడిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించినట్లు తెలిపారు.






