ప్రశాంతంగా లోక్‌సభ ఎన్నికలు
రాచకొండ కమిషనర్ తరుణ్‌జోషి
పోలింగ్ కేంద్రాల సందర్శన, ఏర్పాట్ల పరిశీలన
ఎల్బీనగర్, మే 13 : లోక్‌సభ ఎన్నికలు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంతంగా ముగిసినట్లు కమిషనర్ తరుణ్‌జోషి తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహేశ్వరం, ఎల్బీనగర్, మల్కాజిగిరి, భువనగిరి జోన్ పరిధిలోని ఎన్నికల సరళిని పరిశీలించారు. వివిధ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను, అక్కడ ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ తరుణ్‌జోషి మాట్లాడుతూ.. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు.
ఎన్నికల సందర్భంగా ఆరువేల పోలీసు సిబ్బందితో పాటు 2500 మంది అదనపు కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ముందస్తుగా తీసుకున్న భద్రతా చర్యలతో పాటు పకడ్బందీగా చేసిన ఏర్పాట్లతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదన్నారు. ఎన్నికల అధికారుల సహకారంతో లోక్‌సభ ఎన్నికలను నిష్పపక్షపాతంగా నిర్వహించినట్లు వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని సమస్యాత్మక టేకులసోమారం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి ఓటర్లతో మాట్లాడారు. కమిషనర్ వెంట భువనగిరి డీపీసీ రాజేశ్‌చంద్ర, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్‌కుమార్, మల్కాజిగిరి డీపీసీ పద్మజ, మహేశ్వరం డీసీపీ సునీతతో పాటు ఏసీపీలు, సీఐలు ఉన్నారు.




