20-11-2025 08:40:22 AM
అక్టోబర్ నెలలో ఉత్తమ పనితీరుకు సర్కిల్స్, డివిజన్లకు ప్రత్యేక గుర్తింపు
మంథని,(విజయక్రాంతి): ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(Northern Electricity Distribution Company) పరిధిలోని 16 జిల్లాలలో అక్టోబర్ నెలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన జిల్లాలు, డివిజన్ లు సబ్‌డివిజన్ ల ర్యాంకులను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి వెల్లడించారు. ఈ విభాగంలో పెద్దపల్లి జిల్లా కంపెనీ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించడం విశేషం. పెద్దపల్లి డివిజన్ ద్వితీయ స్థానాన్ని దాసరి తిరుపతి పొందగా, మంథని డివిజన్ తృతీయ స్థానాన్ని మంథని డీఈ ప్రభాకర్ సాధించారు. సబ్‌డివిజన్ ల విభాగంలో ధర్మారం ప్రథమ, సుల్తానాబాద్ ద్వితీయ, కాల్వ శ్రీరాంపూర్ తృతీయ స్థానాలను సంపాదించాయి. ఇది పెద్దపల్లి జిల్లా విద్యుత్ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి సమష్టి కృషి ఫలితమని జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ గంగాధర్ తెలిపారు.
వినియోగదారుల సమస్యలను వెంటనే పరిష్కరించడంలో విద్యుత్ శాఖ ముందంజలో ఉందని, లో వోల్టేజ్ సమస్యలు ఎదురైతే అదనపు ట్రాన్స్ఫార్మర్ లను త్వరితగతిన ఏర్పాటు చేస్తున్నామని, వ్యవసాయ బావులు, బోర్లకు కనెక్షన్లు ఆలస్యం కాకుండా జాగ్రత్త పడుతున్నామని ఆయన పేర్కొన్నారు. సబ్‌స్టేషన్ లలో కరెంట్ అంతరాయం వచ్చిన సందర్భంలో వేరే ఫీడర్ నుంచి వెంటనే సరఫరా కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా ర్యాంకులు సాధించడం అందరి ఇంజనీర్లు, అకౌంట్స్ సిబ్బంది, ఓ అండ్ ఎం సిబ్బంది శ్రమకు నిదర్శనమని అభినందించారు. పెద్దపల్లి డివిజనల్ ఇంజనీర్ డి. తిరుపతి, మంథని డివిజనల్ ఇంజనీర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో, ఎస్.ఈ. గంగాధర్ మార్గదర్శకత్వంలో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఇకపై కూడా పెద్దపల్లి జిల్లా ర్యాంకుల పంట కొల్లగొట్టడానికి అందరూ కష్టపడి పని చేయాలని ఎస్.ఈ. పిలుపునిచ్చారు.