20-11-2025 12:52:26 AM
తెలంగాణ అడ్డా!
కొత్త కొత్త రకాల డ్రగ్స్ డంప్
ప్రతియేటా పెరుగుతున్న కేసులు..
పట్టుబడ్డ సెలెబ్రిటీలపై చర్యలు శూన్యం
* డ్రగ్స్.. ఇప్పుడు రాష్ట్రాన్ని కబళిస్తున్న మహమ్మారి. టీనేజీ పిల్లలు మొదలు పెద్దవారు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్న పరిస్థితి. పోలీసులు, ఎక్సైజు సిబ్బంది, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), ఈగిల్ లాంటి ప్రత్యేక దళాలు ఎప్పటికప్పుడు డ్రగ్స్‌ను పట్టుకుంటున్నా.. కొత్త పద్ధతుల్లో, కొత్త రకాల డ్రగ్స్‌ను మార్కెట్లోకి తెస్తూ.. ప్రజల ప్రాణాలతో డ్రగ్స్ ముఠాలు ఆటాడుకుంటున్నాయి. డ్రగ్స్‌కి హైదరాబాద్ రాజధానిగా మారిం దంటే అతిశయోక్తికాదు. రాష్ట్రంలో డ్రగ్స్ మాటే వినబడకూడదని, డ్రగ్స్ ముఠాలను ఉక్కుపాదంతో అణచివేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరికలు చేస్తున్నా ఆ మహమ్మారి ఎక్కడో ఒకదగ్గర తలెత్తుతూనే ఉంది.
హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి) : తెలంగాణలో డ్రగ్స్ వాడ కం భారీగా పెరుగుతూ వస్తోంది. చిన్న పిల్లలు చదువుకునే పాఠశాలలు, విద్యా సంస్థలకు సమీపంలో చాక్లెట్ల రూపంలోనూ డ్రగ్స్ దొరుకుతుండటాన్ని అనేక సంఘటనలు బయటపడ్డాయి. అలాగే మారుమూల గ్రామా లు, ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగుతుండ టం గమనార్హం. గతంలో అతి స్వల్పంగా ఉన్న డ్రగ్స్ దందా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మెల్లగా పుంజుకుంటూ వస్తోంది.
మరీ ముఖ్యంగా 2018 తరువాత పట్టుబడుతున్న డ్రగ్స్ భారీగా ఉంటోంది. అయితే రాష్ట్రంలోకి వస్తోన్న డ్రగ్స్‌తో పోల్చుకుంటే.. పట్టుబడుతున్న డ్రగ్స్ చాలా తక్కువగా ఉంటోందని, వస్తున్న పరిమాణం.. పట్టుబడుతున్నదానికన్నా ఐదారు రెట్లు ఎక్కువగా ఉండే అవ కాశం ఉందని డ్రగ్స్ నియంత్రణ అధికారుల చెబుతున్నారు.
2018లో పట్టుబడ్డ గంజాయి 5,192 కిలోలు ఉండగా.. 2021 నాటికి అదికాస్తా 41.4 వేల కిలోలకు చేరడం గమనార్హం. అయితే 2024 నాటికి కాస్త తగ్గి.. 24.4 వేల కిలోల గంజాయి పట్టుబడటంతో పోలీసులు, ప్రత్యేక దశాలు కాస్త సమర్థవంతంగా చేస్తున్నా యనే చెప్పవచ్చు.
కొత్త కొత్త డ్రగ్స్..
గంజాయి ఒక్కటే కాదు.. అనేక కొత్త కొత్త రకాల డ్రగ్స్ మార్కెట్లోకి రావడంతో యువత, కౌమార దశలోని పిల్లలు మత్తుకు బానిసలవుతున్నారని చెప్పవచ్చు. 2018, 2021 నాటికి అందుబాటులో లేని.. మార్ఫిన్, ఇంజక్షన్లు, సీబీసీఎల్ బాటిళ్లు, హాషిష్ ఆయిల్ లాంటివి పెద్దమొత్తంలో డ్రగ్స్ రాకెట్ నిర్వాహకులు అందుబాటులోకి తీసుకురావడంతో యువత బానిసలుగా మారు తున్నారు.
పైగా పోలీసులు, ప్రత్యేక దశాలు, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో లాంటివారికి చిక్కకుండా కొత్త కొత్త రకాల డ్రగ్స్‌ను.. మాదకద్రవ్యాల ముఠాలు తీసుకొస్తుండటాన్ని ఇక్కడ గమనించాల్సిన అంశం. వీటితోపాటు.. ఏటీఎస్, కొకైన్, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్, ఎండీఎంఏ, మెపిడ్రోన్, ఓపియం, పాపీ హస్క్, పాపీ స్ట్రా లాంటి వాటి తోపాటు వివిధ రకాల టాబ్లెట్లుకూడా అందుబాటులోకి రావడమో.. సంఖ్య పెరగడమో జరుగుతుందనేది మనం గమనించవచ్చు.
ఏటా పెరుగుతున్న కేసులు..
గడిచిన ఏడేండ్లుగా నమోదైన కేసులు, పట్టుబడుతు న్న నిందితుల సంఖ్యను పరిశీలిస్తే.. మరింత విచ్చలవిడిగా డ్రగ్స్ దందా జడలు విప్పుకుంటుందనే చెప్పవ చ్చు. 2018లో తెలంగాణ రాష్ట్రంలో కేవలం 298 కేసు లు మాత్రమే నమోదవ్వగా.. అందులో 694 మందిని ఆరెస్టు చేశారు. 2021 నాటికి ఈ కేసులు (1,349) సుమారు నాల్గున్నర రెట్లు పెరగడాన్ని గమనించవచ్చు. అదే అరెస్టుల విషయంలో ఐదింతలు (2,999) పెరిగినట్టుగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక 2024 నాటికి పరిశీలిస్తే.. ఈ కేసుల సంఖ్య 2,387కు పెరగ్గా.. అరెస్టు అయినవారి సంఖ్య 5,463కు పెరగడం గమనార్హం. అంటే ప్రతియేటా కేసులు, అరెస్టుల సంఖ్య పెరుగుతుండటంతో డ్రగ్స్ దందా మరింత విస్తృతమవుతోందనే సంకేతాలను వెల్లడిస్తున్నాయి. వీటితోపాటు.. ప్రతి ఏటా పట్టు బడిన డ్రగ్స్‌ను కోర్టు అనుమతితో ధ్వంసం చేస్తున్న పరిమాణంకూడా పెరుగుతూ రావడం మనల్ని కలవరానికి గురిచేస్తున్న అంశంగానే చూడాలి.
ఎక్కువగా పట్టుబడటం అనేది ఎక్కవ పరిమాణంలో అందుబాటులోకి రావడాన్ని సూచిస్తుందని నిపుణులు, స్వచ్చంధ సంస్థ లు పేర్కొంటున్నాయి. అలాగే ఎక్కువ పరిమాణంలో ధ్వంసం చేయడం అనేదికూడా కేసులు పెరుగుతుండ టం.. అదే స్థాయిలో పట్టుబడుతున్న డ్రగ్స్‌ను సూచిస్తుందని వారంటున్నారు.
‘ఈగిల్’తో ప్రత్యేక దృష్టి...
సమాజంలో, రాష్ట్రంలో డ్రగ్స్ పెరిగిపోతుండటాన్ని గమనించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డ్రగ్స్‌ను సమూలంగా రూపుమాపాలనే సదుద్దేశంతో పోలీసు శాఖ లోనే ‘ఈగిల్’ అనే కొత్త దళాన్ని (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) రూపొందించారు. దీని టోల్ ఫ్రీ నెంబరు (1908)కు వచ్చిన సమాచారంతోపా టు, వివిధ నిఘావర్గాల ద్వారా వచ్చిన సమాచారంతో దాడులు నిర్వహిస్తూ.. డ్రగ్ పెడ్లర్లు, రాకెట్ సభ్యులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు.
సమాజాన్ని భయపెడుతున్న డ్రగ్స్ భూతాన్ని కట్టడి చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశం మంచిదే కానీ.. ఈగిల్ బృందానికి, అలాగే డ్రగ్స్ విషయంలో వివిధ విభాగాల మధ్య సమన్వయంతోపాటు.. నిఘావర్గాలు, సంస్థలను మరింత బలోపేతం చేయడం అనేది అత్యం త కీలకంగా కనపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వేళ్ళూనుకుపోయిన డ్రగ్స్ రాకెట్స్ తెలంగాణ నుంచి పూర్తిగా కనుమరుగుకావాలంటే..
కచ్చితంగా పోలీసు శాఖ, ఈగిల్ లాంటి ప్రత్యేక దళం, ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థలను పూర్తిస్థాయిలో ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. ఆయుధాలు, సిబ్బంది సంఖ్యను భారీగా పెంచడం అవసరం. అలాగే నిఘా సంస్థల్లోనూ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థల సేవలను పొందాలి. రోజుకో కొత్త రకం డ్రగ్ పుట్టుకొస్తున్న నేపథ్యంలో వాటిని కనిపెట్టేలా ల్యాబ్‌లను నెలకొల్పాలి. అలా అయితేనే డ్రగ్స్ కదలికలు మనకు తెలియడం, నేరాలన రుజువు చేసేలా దర్యాప్తు ముందుకు సాగుతుంది.
పెరుగుతున్న డ్రగ్స్..
కింది గణాంకాలు పరిశీలిస్తే.. డ్రగ్స్ దందా ఎంత పాతుకుపోయిందో అర్థం అవుతుంది. గడిచిన ఏడేండ్ల గణాంకాలను పరిశీలిస్తే.. కొత్త రకం డ్రగ్స్ మార్కెట్లోకి చొచ్చుకు వస్తున్నాయని, అలాగే యేటికేడు కేసులు, అరెస్టుఅయినవారి సంఖ్య, సీజ్ చేస్తున్న డ్రగ్స్ పరిమాణం భారీగా పెరుగుతూ వస్తున్నాయని అర్థం అవుతోంది.
సెలెబ్రిటీలపై చర్యలేవీ..?
అందరికీ ఒకతోవ అయితే.. సెలెబ్రిటీలది మరోమార్గంగా కనపడు తోంది. అసలు రాష్ట్రానికి డ్రగ్స్‌ను పరిచయం చేసిందే సెలెబ్రిటీలుగా చెప్పుకోవచ్చేమో. వారిని చూసి యువత, చిన్నపిల్లలుకూడా మత్తుకు బానిసలవుతున్నారు. వాస్తవానికి సెలెబ్రిటీలతోనే డ్రగ్స్ కేసులు బయటకు వచ్చాయి. కానీ వారిని విచా రించడం వదిలేయడంతోనే సరిపోతోంది. సెలెబ్రిటీలను కూడా పూర్తి గా విచారించి కఠిన చర్యలు, శిక్షలు వేస్తేనే సమాజంలోని యువత కూడా భయపడేది.
సెలెబ్రిటీలు కనుక.. వదిలేయడం అనేది అందరూ వ్యతిరేకిస్తున్న అంశం. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటేనే సమాజంలోని ప్రజలు కూడా డ్రగ్స్‌కు దూరం అవుతారు. అలాగే విద్యాసంస్థలు, కాలేజీలు, పాఠశాలలపై ప్రత్యే క నిఘా పెట్టాలి. ఎంతటివారైనా డ్రగ్స్ తీసుకున్నా.. డ్రగ్స్ పెడ్లర్లు అయినా, సరఫరా చేసేవారిని కఠినంగా శిక్షిస్తేనే రాష్ట్రం నుంచి డ్రగ్స్ మాఫియాను తరిమికొట్టగలం.