20-11-2025 08:43:31 AM
సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు పెద్దపల్లి ప్రజల తరుపున కృతజ్ఞతలు
పెద్దపల్లి ఆర్టీసీ బస్సు డిపో శంకుస్థాపనలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి ప్రజల కళ సహకారం అయింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపో నిర్మాణానికి బుధవారం ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి బుధవారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు భూమి పూజ చేశారు. అనంతరం బస్ డిపో ఏర్పాటు చేయనున్న పాత ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... బస్సు డిపో ఏర్పాటు పెద్దపల్లి ప్రజల చిరకాల వాంఛ అని, సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన యువ వికాస పబ్లిక్ మీటింగ్ కు వచ్చిన సందర్భంగా పెద్దపల్లి బస్ డిపో ఏర్పాటుకు జీవో ఇచ్చారని తెలిపారు. అందుకు అనుగుణంగా 4 ఎకరాల 34 గుంటల భూమిని ఆర్టీసీకి ఇచ్చినట్టు తెలిపారు.
సివిల్ సప్లై గోదాం, ఈఈ కార్యాలయం, మండల పరిషత్ తదితర కార్యాలయాలను షిఫ్ట్ చేసి, ఇటీవల చెట్లను తీసివేయడం జరిగిందన్నారు. ఆర్టీసీకి ఏ బిల్డింగ్ అవసరమో ఆర్ ఎం నేతృత్వంలో ప్లాన్ చేసి ముందుకు పోతున్నట్టు తెలిపారు. 6 నుండి 8 నెలల్లో డిపో పూర్తి చేసి, ఇక్కడి నుండే బస్సులు నడిచే విధంగా ప్లాన్ చేయడం జరిగిందని అన్నారు. బస్ డిపో మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి దీనికి సహకరించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కు, దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు బస్సు డిపో పనులకు సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా ఎప్పుడు అవసరమొచ్చిన తనను సంప్రదించాలని ఆయన సూచించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఒక్కదాని వెంట ఒకటి పూర్తి చేస్తున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలని తద్వారా మరింత అభివృద్ధిసాధ్యమవుతుందని, మరింత ఉత్సాహంతో అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.