08-12-2025 01:15:02 AM
త్వరలోనే గ్రామాలకు వస్తానని కేంద్రమంత్రి బండి సంజయ్ వెల్లడి
కరీంనగర్, డిసెంబరు 7 (విజయక్రాంతి): జిల్లాలోని గన్నేరువరం మండలం పీచుపల్లి, హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ గ్రామ పంచాయతీ సర్పంచుల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందో ఆ గ్రామానికి రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులు ఇస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇచ్చిన పిలుపుతో కోహెడ గ్రామస్తులంతా కలిసి బీజేపీ గ్రామ శాఖ పోలింగ్ బూత్ అధ్యక్షులు రాజశేఖర్ భార్య అమూల్య రాజశేఖర్ ను సర్పంచ్ గా ఏకగ్రీవం చేయాలని నిర్ణయించారు. అమూల్య రాజశేఖర్ సైతం గ్రామాభివ్రుద్ధి కోసం తన వంతుగా 9 లక్షలు అందజేశారు.
దీంతో కోహెడ్ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. మరోవైపు గన్నేరువరం మండలం పీచుపల్లి గ్రామ సర్పంచ్ గా సామ రాజిరెడ్డిని సైతం గ్రామస్తులు ఏకగ్రీవం చేశారు. వారు ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వారికి శాలువా కప్పి సన్మానించారు. ఇచ్చిన మాట మేరకు ప్రోత్సాహక నిధులను అందిస్తానని హమీ ఇచ్చారు. అతి త్వరలోనే కోహెడతోపాటు పీచుపల్లి గ్రామాల్లో పర్యటించి అభివ్రుద్ధి పనులు కూడా చేపడతానని బండి సంజయ్‌హమీఇచ్చారు.