19 April, 2026 | 4:27 AM

పెండింగ్.. ఫ్రైడే!

28-06-2024 01:06 AM

ఖరారు కాని పీసీసీ కొత్త సారధి.. నేడు మరోసారి అధిష్ఠానంతో చర్చలు

పాతవారికే ప్రాధాన్యం ఇవ్వాలని కోరాం: డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి

వాయిదా పడిన సీఎం వరంగల్ పర్యటన

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): పీసీసీ నూతన అధ్యక్షుడి ఎన్నిక, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎటూ తేల్చలేదు. గురువారం రాత్రి ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఢిల్లీలోని ఆయన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమై దాదాపు రెండు గంటలకుపైగా చర్చించినా ఒక నిర్ణయానికి రాలేకపోయారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి పదవీకాలం గురువారంతో ముగియడంతో కొత్త సారధిని నియమించాల్సి ఉంది.

ఈ పదవి కోసం పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ జగ్గారెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ప్రధానంగా పోటీ పడుతున్నారు. క్యాబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు బెర్తుల కోసం దాదాపు డజన్ మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నారు. దీంతో ఈ రెండు అంశాలపై అధిష్ఠానం పెద్దలతో చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రంలో ఉండగా, ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతో హుటాహుటిన హస్తినకు వెళ్లారు.

సీఎం పదవి రెడ్డికి, డిప్యూటీ సీఎం పదవి ఎస్సీ నేతలకు ఉండటంతో.. పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ పదవి కోసం మధుయాష్కీగౌడ్, మహేష్‌కుమార్‌గౌడ్ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నది. ఎస్సీ కోటాలో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పేరు తెరపైకి వచ్చింది. కేసీ వేణుగోపాల్‌తో జరిగిన సమావేశంలో మాత్రం మహేష్‌కుమార్‌గౌడ్, మధుయాష్కీ గురించే చర్చ జరిగినట్లుగా సమాచారం. 

నేడు మళ్లీ చర్చలు

మంత్రి విస్తరణ విషయంలో గురువారం తుది నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ భేటీ శుక్రవారానికి వాయిదా పడింది. శుక్రవారం కేసీ వేణుగోపాల్ నివాసంలో మరోసారి ఈ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశం కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలోనే ఉండాల్సి రావటంతో సీఎం వరంగల్ టూర్ శనివారానికి వాయిదా పడింది. కాగా, ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వొద్దని కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ నిర్మాణంలో ఉన్న వారికే పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని కూడా ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం. 

పార్టీ కోసం పనిచేసినవారికే ప్రాధాన్యం   

గురువారం నాటి సమావేశంలో క్యాబినెట్ విస్తరణ, పార్టీ పదవులపై చర్చించామని భట్టి విక్రమార్క తెలిపారు. పార్టీలో చేరికల అంశం కూడా చర్చకు వచ్చిందని చెప్పారు. కేసీ వేణుగోపాల్‌తో సమావేశం అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్లకు సముచిత స్థానం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామని ప్రకటనలు చేస్తున్నాయని విమర్శించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ ఉండాలని గతంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారని, అందుకు రాహుల్‌గాంధీ ఒప్పుకున్నారని తెలిపారు.