19 April, 2026 | 2:36 AM

కమిషన్ విచారణ చేస్తే తప్పేంటి?

28-06-2024 01:07 AM

కేసీఆర్ ‘విద్యుత్’ పిటిషన్‌పై హైకోర్టు

పిటిషన్‌కు నంబర్ కేటాయించండి

రిజిస్ట్రీకి ఆదేశం.. విచారణ నేటికి వాయిదా

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): గత కేసీఆర్ ప్రభుత్వంలో విద్యుత్ వ్యవహారాలపై తీసుకున్న నిర్ణయాల్లో లోపాలు జరిగాయంటూ ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. పిటిషన్‌కు నంబర్ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.

పిటిషన్‌కు నంబర్ ఇచ్చేందుకు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను కోర్టు కొట్టివేసింది. జస్టిస్ నరసింహారెడ్డి నిష్పక్షపాతంగా లేరని విలేకరుల సమావేశం ద్వారా చెప్పారని, కాబట్టి వ్యక్తిగత హోదాలో జస్టిస్ నర సింహారెడ్డిని ప్రతివాదిగా చేర్చడంతో రిజిస్ట్రీ అభ్యంతరం చెప్పింది. దీనిపై గురువారం కేసీఆర్ తరఫు వాదనలు జరిగాయి. పిటిషన్‌కు నెంబర్ కేటాయించాలని, దానిపై శుక్ర వారం సమగ్ర విచారణ చేస్తామని కోర్టు ప్రకటించింది. 

విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలు, ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంక్వయిరీ కమిషన్ విచారణను నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేయాలని కేసీఆర్ లాయర్ సోంధి కోరగా హైకోర్టు నిరాకరించింది. ఎంక్వయిరీ కమిషన్ విచారణ చేస్తే తప్పేమిటని ప్రశ్నించింది. కమిషన్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చాక, దానిని ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టాక దానిపై  చర్చ చేయవచ్చు కదా అని ప్రశ్నించింది. దీనిపై కేసీఆర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, అసలు కమిషన్ వ్యవహరిస్తున్న తీరునే ప్రశ్నిస్తున్నామని, కమిషన్ జస్టిస్ నర్సింహారెడ్డి విచారణ పూర్తి చేయకుండానే అసమగ్ర వివరాలను సేకరించి తప్పు జరిగిపోయిందని విలే కరుల సమావేశంలో వెల్లడించారని చెప్పారు. కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, ఏకపక్షంగా వ్యహరిస్తోందని చెప్పారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ పిటిషన్‌కు నెంబర్ కేటాయించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. 

ఛత్తీస్‌గఢ్ తెలంగాణ విద్యుత్ కొనుగోలు వ్యవహారాలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు (పీపీఏ), పరస్పర అవగా హన ఒప్పందం (ఎంఓయూ) చేసుకోవడం లో అక్రమాలు జరిగాయని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్ 1952 ప్రకారం జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్‌ను గత మార్చి 14న నియమించింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ కేసీఆర్ వేసిన పిటిషన్‌కు నంబర్ కేటాయించలేదు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్(కేసీఆర్)తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయ వాది ఆదిత్యా సోంధీ వాదనలు వినిపించారు.

‘కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్లో విచారణ ఎలా సాగాలో మార్గదర్శకాలు జారీ చేయడం చట్ట వ్యతిరేకం. విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ల ఏర్పాట్లల్లో అక్రమాలు జరిగాయంటూ కమిషన్‌కు దిశానిర్దేశం చేశారు. పిటిషనర్(కేసీఆర్) విచారణకు హాజరుకావాలని సెక్షన్ 8బీ ప్రకారం కమిషన్ నోటీసులు జారీ చేసింది. గతంలో ఇదే హైకోర్టు ద్వి సభ్య ధర్మాసనం ఇచ్చి తీర్పులకు ఈ నోటీసులు విరుద్ధమే. లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున జూన్ 15 వరకు గడువు ఇవ్వాలని పిటిషనర్ కమిషన్‌కు లేఖ రాశారు. ఇదిలాఉండగా, విచారణ పూర్తికాకుండానే.. వివరాలు పరిశీలించకుండానే.. జస్టిస్ నరసింహారెడ్డి ఈ నెల 11న మీడియా భేటీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పటికే విచారణపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలియజేస్తున్నాయి. గత ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూ ఏకపక్షంగా వ్యవహరించారు. ఇది ధార్మియా కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు విరుద్ధం. కమిషన్ ఏం చేయబోయేదీ కూడా ముందే విలేకరులకు చెప్పడం చట్ట వ్యతిరేకం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కమిషన్కు ఎలాంటి ఆదేశాలు, ఉత్తర్వులు జారీ చేసే అధికారులు ఉండవు. విచారణ జరిపి నివేదిక మాత్రమే అందజేయాల్సి ఉంటుందన్న విషయాన్ని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఉల్లంఘించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు వినియోగించే సాంకేతికతతో ప్రభుత్వానికి రూ.250 కోట్లు నష్టం వస్తుందని ముందే తేల్చేశారు. దీంతో ఆయన ఇవ్వబోయే నివేదిక ఎలా ఉండనుందో తెలుస్తుంది. ఈ కారణాలతోనే ఆయనను ప్రతివాదిగా చేర్చాలి వచ్చింది’అని సోంధీ పేర్కొన్నారు.

ఈ వాదనలపై అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషన్‌కు  నంబర్ కేటాయింపు, రిజిస్ట్రీ అభ్యంతరాలపై మాత్రమే వాదనలు వినిపించాల్సి ఉండగా, కేసు మెరిట్‌లోకి వెళ్లడం సరికాదన్నారు. జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిని ఎందుకు ప్రతివాదిగా చేర్చామో అనే అంశంపై మాత్రమే వివరాలు వెల్లడిస్తున్నామని సోంధీ బదులిచ్చారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ వివరాలు విని నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. అనంతరం సోంధీ వాదనలు వినిపిస్తూ.. ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ), విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)తో పాటు కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు చేపట్టాం. పీపీఏలపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి... అని చెప్పారు.

జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించడాన్ని తప్పుపడుతూ పిటిషనర్ లేఖ రాసినట్లు సోంధి చెప్పారు. కమిషన్ పరిధిని దాటిన కారణంగా విచారణ నుంచి తప్పుకోవాలని పిటిషనర్ లేఖ ద్వారా కోరితే జస్టిస్ నరసింహారెడ్డి నుంచి స్పందన లేదన్నారు. కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించారని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కమిషన్ విచారణ పూర్తి చేయకుండానే ప్రభుత్వం నిర్ధేశించినట్లుగా తప్పు జరిగిందనే నిర్ధారణకు వచ్చారన్నారు. ఈ నెల 30తో కమిషన్ నివేదికను ప్రభుత్వానికి అందజే యనుందని, ఈలోగానే హైకోర్టు స్పందించాలని కోరారు. నోటీసు దశలోనే కమిషన్ తప్పు జరిగిందనే నిర్ణయానికి వచ్చేయడాన్ని, ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో వెల్లడించడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు.  

‘తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాల మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఈఆర్సీ కూడా ఆమోదించింది. సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించి కూడా కమిషన్ తన వైఖరిని వెల్లడించడం చెల్లదు. ఏది మంచో.. ఏది ఉత్తమమో.. తేల్చే అధికారం కమిషన్‌కు లేదు. సిఫార్సులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. విచారణ కమిషన్ చైర్మన్ పక్షపాతంగా వ్యహరిస్తున్నారు. ఆయన నివేదిక ఎలా ఇవ్వనున్నారో ఇప్పటికే తెలిసిపోయింది. కేసీఆర్ వ్యక్తిగత పరువుకు భంగం వాటిల్లేలా జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి మీడియాలో చేసిన వ్యాఖ్యలు చేశారు. నివేదిక అందజేయాలనికి రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఈ నెల 30 వరకు సమయం ఇచ్చింది. కోర్టు అనుమతి లేకుండా ప్రభుత్వానికి నివేదిక సమర్పించకుండా కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలి’ అని సోంధివివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్‌కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మళ్లీ శుక్రవారం వాదనలు వింటామంది. శుక్రవారం అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించే అవకాశం ఉంది.