19 April, 2026 | 6:19 AM

సీతారామ దిగ్విజయం

28-06-2024 01:04 AM
  1. బీజీ కొత్తూరు వద్ద పంపుహౌస్ ట్రయల్న్ సక్సెస్ 
  2. ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్‌కు వరం

ప్రాజెక్టు పూర్తయితే ౧౦ లక్షల ఎకరాలకు నీరు 

ఆగస్టులో సీతారామ నుంచి రైతులకు నీళ్లు

మూడేండ్లలో ప్రాజెక్టు మొత్తం పూర్తిచేస్తాం 

మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటన

ఖమ్మం, జూన్ 27 ( విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు తలపెట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్‌ను గురువారం విజయవంతంగా నిర్వహించారు. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద పంపుహౌస్ ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడం పట్ల రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు హర్షం వ్యక్తంచేశారు. ఆగస్టు నుంచి సీతారామ ఎత్తిపోతల పధకం ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. పంప్‌హౌజ్ ద్వారా 1500 క్యూసెక్కుల నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 4 పంపుల ద్వారా 104 కిలోమీటర్లు నీటి సరఫరాకు ప్రధాన కాలువ పనులు పూర్తి చేశామని చెప్పారు. ఈ కాలువను ఏన్కూరు వద్ద నాగార్జనసాగర్ కాలువకు అనుసంధానం చేయను న్నట్లు తెలిపారు. దీని ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని 1.20 లక్షల ఎకరాలకు మొదటి విడతలో సాగునీటిని అందించనున్నట్లు వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో విడతలవారీగా సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. 

సీతారామచంద్రస్వామి ఆశీస్సులతోనే 

సీతారామచంద్రస్వామి ఆశీస్సులతోనే గోదావరి జలాలను ఎత్తిపోసే ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగిందని తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు.  పంప్‌హౌజ్ ట్రయల్ రన్ విజయవంతం అయిన అనంతరం కొత్తగూడెంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తిచేసేందుకు నిధులు సమకూర్చుతామని సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఇచ్చిన హామీ ప్రకారం ఉమ్మడి ఖమ్మం జిల్లా తో పాటు మహబూబాబాద్ జిల్లా లను సస్యశ్యామలం చేసేందుకు కట్టుబడి ఉన్నాన్న విషయం రుజువైందని పేర్కొన్నారు. 

సీతారామ ఎత్తిపోతల పథకంలో రెండు, మూడో దశ పనులను సైతం ఈ ఏడాదిలోనే పూర్తి చేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభింపజేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఉప భట్టి నియోజకవర్గమైన మధిర  రైతాంగానికి కూడా లబ్ధి చేకూరనుందని తెలిపారు.

 గత పాలకులు సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.9 వేల కోట్లు ఖర్చుచేసి ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేదని విమర్శించారు. రేవంత్ సర్కార్ కొలువుదీరిన వెంటనే సాగునీటి ప్రాజెక్టుల వివరాలన్నీ తీసుకొని ఆరు నెలలు, ఏడాది, మూడేళ్లు, ఐదేళ్లలో పూర్తిచేసి రైంతాగాన్ని ఆదుకునే అవకాశం ఉన్న అన్ని ప్రాజెక్టులను గుర్తించామని వివరించారు. 

వీటిని ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేసి రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. రూ.70 కోట్లతో వైరా ప్రాజెక్టుకు లింక్ కెనాల్‌ను అనుసంధానం చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఛీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఈలు వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కార్యనిర్వాహక ఇంజనీర్ వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. సీతారామ ప్రాజెక్టు మొత్తం పూర్తయితే ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది.