పెండింగ్ స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలి
కుమ్రంభీం ఆసిఫాబాద్, మార్చి 25(విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా గురువారం చేపట్టే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కళాశాలల బంద్‌ను విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి పిలుపునిచ్చారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్లేకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ విద్యారంగానికి తగిన నిధులు కేటాయించకుండా ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తోందని విమర్శించారు.
విద్యార్థులకు సంబంధించిన రూ.10 వేల కోట్లకు పైగా స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, దీంతో విద్యార్థులు సర్టిఫికెట్లు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ ఐఎఫ్ ఖాన్, ఆసిఫాబాద్ మండల అధ్యక్షుడు షేక్ సమీర్, మండల కార్యదర్శి జగజంపుల తరుణ్, సభ్యులు అయాన్, జావీద్, సాయి తేజ, భీమ్రావు, ప్రశాంత్, మధుకర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.




