calender_icon.png 17 August, 2025 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మూలో మరో క్లౌడ్ బరస్ట్.. నలుగురు మృతి

17-08-2025 09:56:04 AM

జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌(Jammu and Kashmir)లోని కిష్త్వార్ జిల్లాలో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలతో ఘోర విషాదం జరిగిన విషయం తెలిసిందే.. ఈ ఘటన మరువకముందే కథువా జిల్లా(Kathua District)లోని ఓ మారుమూల గ్రామంలో మేఘా విస్ఫోటం సంభవించింది. ఈ విపత్తులో నలుగురు మరణించగా, ఆరుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. శనివారం, ఆదివారం మధ్య రాత్రి రాజ్‌బాగ్‌లోని జోడ్ ఘాటి గ్రామంలో మేఘా విస్ఫోటం సంభవించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని.. ఆస్తి నష్టం కొంత వాటిల్లిందని అధికారులు తెలిపారు. తీవ్ర ప్రయత్నాల తర్వాత పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం(SDRF) సంయుక్త బృందం సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక స్వచ్ఛంద సేవకులతో కలిసి చర్యలు మొదలుపెట్టారు. 

ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన ఆరుగురురిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. కథువా పోలీస్ స్టేషన్ పరిధిలోని బగార్డ్, చాంగ్డా గ్రామాలు.. అలాగే లఖన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిల్వాన్-హుట్లీలో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. కాగా, ఈ ప్రమాదంతో పెద్దగా నష్టం జరగలేదని వారు తెలిపారు. భారీ వర్షాల కారణంగా అనేక నీటి వనరులలో నీటి మట్టం గణనీయంగా పెరిగిందని, ఉజ్ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని, ప్రజలు తమ భద్రత కోసం నీటి వనరులకు దూరంగా ఉండాలని కోరినట్లు అధికారులు తెలిపారు.