08-12-2025 06:11:48 PM
నూతనకల్ (విజయక్రాంతి): మండల పరిధిలోని వెంకేపల్లి గ్రామంలో సోమవారం డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో ధైర్యాన్ని నింపేందుకు, శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు పోలీసులు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కవాతు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో ఎలాంటి గొడవలు, వివాదాలు లేకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి సీఐ నరసింహారావు, ఎస్సై నాగరాజు, ఏఎస్ఐ అరవింద్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.