2 May, 2026 | 3:36 AM

రైతు కష్టం ఆవిరి

02-05-2026 02:22 AM
  1. అన్నదాతలకిచ్చిన హామీలను అమలు చేయకుంటే ఆందోళన తప్పదు
  2. సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): తెలంగాణలో అన్నదాతల ఆశలను కాంగ్రెస్ సమాధి చేసిందని, ఆరుగాలం కష్టాన్ని ఆవిరి చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలోని అన్నదాతలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుంటే ఆందోళన తప్పదని లేఖ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. రాష్ట్రంలోని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

కళ్ల ముందే తాలు, తేమ పేరుతో రైతులను నిలువునా ముంచుతున్నా పట్టించుకోరా అంటూ లేఖలో పేర్కొంటూ అసహనం వ్యక్తం చేశారు. మండుటెండల్లో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోరా అని సీఎంను ప్రశ్నించారు. గత రబీ సీజన్‌కు సంబంధించి సన్నవడ్ల బోనస్ ఎగ్గొట్టారని.. ఈ సీజన్‌లో అసలు బోనస్ ఇస్తారా లేదా అని సీఎంపై మండిపడ్డారు. పత్తి పంటకు కనీస మద్దతు ధర ఎగ్గొట్టి రైతులను ముంచారని రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొక్కజొన్నకు కేంద్రం మద్దతు ధర ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు బాధ్యతను విస్మరించి దళారులకు కొమ్ముకాస్తున్నదంటూ ఆరోపించారు. అకాల వర్షాల కారణంగా గత రెండున్నరేళ్లలో 5 లక్షలకుపైగా ఎకరాల్లో పంట నష్టం జరిగినా ఆదుకోలేదన్నారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.5 వేల కోట్లు పరిహారం చెల్లించాల్సి ఉంటే రూ.260 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. దళారులకు దోచిపెట్టి.. రైతులను రోడ్డున పడేయడమే మీ విధానమా అని నిప్పులు చెరిగారు. 

బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రూ.56 వేల కోట్ల అప్పుతో పౌర సరఫరాల శాఖ కార్పోరేషన్‌ను దివాలా తీయించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ రెండున్నరేళ్లలో ఈ సంస్థను రూ.లక్ష కోట్ల అప్పుల పాలు చేసిందని వివరించారు. వరంగల్ డిక్లరేషన్‌ను పాతిపెట్టారని, రాయపూర్ ఏఐసీసీ రైతు తీర్మానాలకు తిలోదకాలిచ్చారంటూ ఆగ్ర హం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వడగాల్పుల తో జనం అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించరా అంటూ సీఎంను ప్రశ్నించారు. కరప్టన్, కలెక్షన్, ల్యాండ్ సెటిల్మెంట్లు తప్ప రైతుల కన్నీ టి వెతలు పట్టవా అని సంజయ్ చురకలంటించారు. నమ్మి ఓటేసిన పాపానికి అన్నదా తలను నట్టేట ముంచుతారా? అని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర ప డినా మీలో చలనం లేదా అని నిలదీశారు.