ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, మే 21 (విజయక్రాంతి) : జిల్లాలో నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత ఎక్కువై ఉష్ణోగ్రతలు పెరగనున్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.
మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటకు రావద్దన్నారు. బయటకు వెళ్లేటప్పుడు కాటన్ దుస్తులు ధరించడం, తలకు టోపీ, రుమాలు లేదా గొడుగు తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. అలాగే దాహం వేయకపోయినా తరచూ నీరు తాగుతుండాలన్నారు.
మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్ లవణాల మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల వడదెబ్బ బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నారు. ఈ విషయానికి సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను 6281492368 నెంబర్ ద్వారా సంప్రదించవచ్చన్నారు.






