calender_icon.png 6 December, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 శాతం హామీ.. 21శాతమే అమలు!

06-12-2025 12:59:00 AM

  1. బీసీల ఆవేదనకు నిదర్శనం ఈశ్వరాచారి మృతి

బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్

హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 5 (విజయక్రాంతి): రాష్ర్టంలో 42 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని నమ్మిన బీసీలకు.. చివరకు అది 21.39 శాతానికి పడిపోవడం మింగుడు పడటం లేదు. ఈ పరిణామంతో బీసీ సమాజం ఎంత మానసిక ఆవేదనకు గురవుతుందో చెప్పడానికి సాయి ఈశ్వరాచారి మరణమే నిదర్శనం అని తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్ జి.నిరంజన్ వ్యాఖ్యానించారు.

మేడ్చల్ మల్కాజిగిరిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బీసీలకు జరిగిన అన్యాయంపై మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వరాచారి.. గురువారం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం పట్ల నిరంజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరంజన్ బీసీ యువతకు కీలక విజ్ఞప్తి చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించే వరకూ పోరాటం చేయాలి తప్ప.. ఇలా మానసికంగా కలత చెంది ప్రాణాలు తీసుకోవద్దు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు అని హితవు పలికారు.

సాయి ఈశ్వరాచారి మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఆయన బలిదానం 42 శాతం రిజర్వేషన్ అమలయ్యే వరకూ స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. రిజర్వేషన్ల గణాంకాల్లో తప్పులు జరిగాయని, వాటిని పరిశీలించి సరిదిద్దాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని నిరంజన్ ఆవేదన వ్యక్తం చేశారు. లోపాలను సవరించకుండానే ఎన్నికలకు వెళ్లడం దురదృష్టకరమన్నారు. మరణించిన సాయి ఈశ్వరాచారి కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేసియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.