06-12-2025 01:02:03 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 5 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల సాధన కో సం ప్రాణత్యాగం చేసిన సాయి ఈశ్వర్‌చారి మరణం రాష్ర్టంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది సాధారణ ఆత్మహత్య కాద ని, ముమ్మాటికీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిన ప్రేరేపిత హత్యే అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు ఈశ్వర్‌చారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన బీసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.
సాయి ఈశ్వర్‌చారి మృతదేహాన్ని సందర్శించి, కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పల్లె రవికుమార్, జూలూరి గౌరీశంకర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, బొల్లా రం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విష యం తెలుసుకున్న శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, సోమాజిగూడ మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ హుటాహుటిన బొల్లారం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ వారికి మద్దతుగా నిలిచారు.
రాజకీయ వంచనకు బలి
ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు మాట్లాడుతూ.. సాయి ఈశ్వర్‌చారి స్వయంకృత కారణాల తో చనిపోలేదని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వ రాజకీయ వంచనకు బలైపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ‘42 శాతం రిజర్వేషన్లు వస్తాయని నమ్మి, విశ్వాసం ఉంచిన యువకుడిని ప్రభుత్వం చీకటిలోకి నెట్టేసింది. బీసీల ప్రాణాలతో, ఆత్మగౌరవంతో కాంగ్రెస్ ఆటలాడుకుంటోంది’ అని మండిపడ్డారు.
ఇది బీసీ ప్రతిఘటనకు ఆరంభం
ఈశ్వర్‌చారి మరణం ఓ ముగింపు కాదని, బీసీల ప్రతిఘటనకు ఇది ఆరంభమని శ్రవణ్ హెచ్చరించారు. ఈ దుర్ఘటన రేవంత్‌రెడ్డి ప్రభుత్వ అహంకారానికి, తానాషాహీ పోకడలకు శాశ్వత నిదర్శనంగా నిలిచిపోతుందన్నారు. ‘బీసీ రిజర్వేషన్లు అమలయ్యే వరకు.. రాజ్యాంగ హామీలు నెరవేరే వరకు.. సామాజిక న్యాయ ద్రోహులను శిక్షించే వరకు మా పోరాటం ఆగదు. సాయి మరణం వృథాకానివ్వం.. అతడు రగిల్చిన ఉద్యమ జ్వాలను ముందుకు తీసుకెళ్తాం’ అని శ్రవణ్ స్పష్టం చేశారు. మృతుడి కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.