బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి
- ఆగస్టు 6న భారీ బహిరంగం సభ
- దేశవ్యాప్త బీసీ ఉద్యామాలకు దిక్సూచీగా సభ
- ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా బీసీ రిజర్వేషన్ల సాధనకు సంకల్పం తీసుకుందాం
- టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, దీన్ని సాధించేందుకు ఆగస్టు 6న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సంభ నిర్వహిస్తున్నామని టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో బీసీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రొఫెసర్ జయశంకర్‌సార్ జయంతి సందర్భంగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సంకల్పం తీసుకుంటామని తెలిపారు. ‘సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ’ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. బీసీలతోపాటు సమాజంలోని అనిన వర్గాల వారిని ఒక్కతాటిపైకి తీసుకువచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామన్నారు.
ముందు భౌగోళిక తెలంగాణ సాధించుకుందాం.. ఆ తర్వాత సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం పాటు పడుదామన్న ప్రొఫెసర్ జయశంకర్ గారి సూచనల మేరకు తాము 5 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పాటు పడుతున్నామని తెలిపారు. జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జాగృతి, టీఆర్‌ఎస్ రెండేళ్లుగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. ఆగస్టు 6న హైదరాబాద్ వేదికగా మనం నిర్వహించే బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన సభ దేశ గతినే మార్చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమిళనాడులోని స్కూళ్లలో ఎంజీఆర్ ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని తెలిపారు.
అదే విధంగా దేశవ్యాప్తంగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం చేసే ఉద్యమాలకు హైదరాబాద్ సభ దిక్సూచీగా నిలుస్తుందన్నారు. ఆగస్టు 6 ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని టీఆర్‌ఎస్ పార్టీ సామాజిక న్యాయ తెలంగాణ దినోత్సవంగా నిర్వహిస్తుందని తెలిపారు. తాము చేసిన ఉద్యమాలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గిందన్నారు. అందుకే బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా రెండు వేర్వేరు బిల్లులు అసెంబ్లీ, కౌన్సిల్‌లో పాస్ చేసి కేంద్రానికి పంపిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లులకు ఆమోదం తెలిపేలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస ప్రయత్నాలు కూడా చేయడం లేదన్నారు. ‘మనమెంతో మనకంత’ అనే నినాదం సాకారం కావాలంటే అన్ని వర్గాలను కలుపుకొని 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఐక్య ఉద్యమాలు చేద్దామని కవిత పిలుపునిచ్చారు.






