తుపాకీ కాల్పుల్లో పెంపుడు కుక్క మృతి
ముత్తారంలో ఘటన మాజీ ఆర్మీ జవాన్‌పై ఆరోపణలు
కోతుల కోసం గతంలో విద్యుత్ తీగలు ఇప్పుడు కుక్కపై కాల్పులంటూ ఆరోపణలు
జనావాసాల మధ్య కాల్పులతో స్థానికుల్లో ఆందోళన
(ముదిగొండ, విజయక్రాంతి): ముత్తారం పరిధిలో ఓ ఇంటి యజమానికి చెందిన పెంపుడు కుక్కపై మాజీ ఆర్మీ జవాన్ తన ఇంటి ముందు తుపాకీతో కాల్పులు జరిపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో కుక్క మృతి చెందడంతో దాని యజమాని కుటుంబంలో విషాదం నెలకొంది. జనావాసాల మధ్య కాల్పులు జరగడంతో పరిసర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం, కుక్కను దాని యజమాని ఇంటి వద్ద పెంచుకుంటుండగా, తాజాగా అది మాజీ ఆర్మీ జవాన్ ఇంటి ముందు ఉండగా తుపాకీతో కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
అయితే కాల్పులకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది.కాగా, గతంలో కోతులు గార్డెన్‌లోకి రాకుండా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసినట్లు, ఈ ఘటనలో రెండు కోతులు మృతి చెందినట్లు కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు.అప్పట్లో పోలీసులకు సమాచారం ఇవ్వగా మందలించినట్లు చెబుతున్నారు.తాజా ఘటన నేపథ్యంలో తుపాకీకి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉందా కాల్పులు నిబంధనలకు అనుగుణంగా జరిగాయా అనే అంశాలను hపోలీసులు నిర్ధారించాల్సి ఉంది.ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.






