21 April, 2026 | 11:35 PM

రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలి

19-09-2025 11:49 PM

మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని మార్కెట్ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని టిజిఆర్టిసి బస్సు సౌకర్యం మెరుగుపరచాలని, మందమర్రి మార్కేట్ నుండి మంచిర్యాలకు బస్సు ట్రిప్ లు పెంచాలని యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణం నుండి మంచిర్యాలకు, హైదరాబాద్ కు వెళ్లే బస్సులు మార్కెట్ బస్టాండ్ లోకి వచ్చి వెళ్లాలని కోరుతూ  శుక్రవారం మంచిర్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ సీరం జనార్ధన్ కు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా మందమర్రి మార్కెట్ నుండి మంచిర్యాల, హైదరాబాద్ కి వెళ్లే విద్యార్థు లు,వివిధ దుకాణాలలో, షాపింగ్ మాల్ లో పనిచేసే ప్రజలు, ఉపాధి కొరకు నిరంతరం ప్రయాణిస్తున్న పట్టణ ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని, మందమర్రి మార్కెట్ నుండి మంచిర్యాలకు బస్సు వేయాలని కోరారు. అది వీలుగాని పక్షంలో బెల్లంపల్లి నుండి మంచిర్యాలకు వెళ్లే బస్సులను ఉదయం 3 ట్రిప్ లు, సాయంత్రం 3 ట్రిప్ లు మార్కెట్ లోపలికి వచ్చి, వెళ్లాలని సూచించారు.

ముఖ్యంగా మందమర్రి మార్కెట్ నుండి హైదరాబాద్ కి గత కొద్ది కాలం నుండి బస్సులు రావడం లేదని తెలిపారు. సమస్యలపై డిపో మేనేజర్  సానుకూలంగా స్పందించారన్నారు. వారం రోజులలో మందమర్రి మార్కెట్ నుండి హైదరాబాద్ కి బస్సు నడిపిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అదే విధంగా మందమర్రి మార్కెట్లో ఉదయం 9 గంటలకు వెళ్లే మంచిర్యాల బస్సు, 20 నిమిషాల పాటు మార్కెట్ టిజిఆర్టిసి బస్టాండ్ లోనే ఆపుతామని హామీ ఇచ్చారన్నారు. అతి త్వరలో మార్కెట్ నుండి మంచిర్యాల కు ఒక ట్రిప్ బస్సుని పెంచుతామని హామీ ఇచ్చారన్నారు.