20-09-2025 12:00:00 AM
జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్
ఎల్బీనగర్, సెప్టెంబర్ 19 : సరూర్ నగర్ చెరువును అద్భుతంగా తీర్చిదిద్దుతామని జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. సరూర్నగర్ చెరువు కట్ట వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. సమీక్షలో జీహెచ్‌ఎంసీ, ఎస్‌ఎన్డీపీ, ఇరిగేషన్, మెయింటెనెన్స్, టౌన్ ప్లానింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... ప్రస్తుతం చెరువు వద్ద ప్రధాన పనులు జరుగుతున్నా యని చెప్పారు. చెరువు బండ్ల బలోపేతం, వర్షపు నీటి మళ్లింపు, కొత్త డ్రైనేజీ లైన్లు, చెరువు అందాల పరిరక్షణ, పచ్చదనం, చెరువు కట్ట వద్ద కొత్త వంతెన నిర్మాణం, ఎల్బీనగర్ నుంచి సరూర్నగర్ వరకు సేవరేజ్ డ్రైనేజి నిర్మాణం, చెరువుల సంరక్షణ, అభివృద్ధి సంబంధిత ఇతర పనులు జరుగుతున్నాయని వివరించారు.
కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, వీటితో నీటి పారుదల నియంత్రణ, వరద నివారణ, చెరువుల అందాలు పెంపొందించడం సాధ్యమవుతుందన్నారు. చెరువులను సమాజానికి సుస్థిర ఆస్తులుగా మార్చే దిశగా ఈ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
కార్యక్రమంలో అధికారులు: ఎస్‌ఈ అశోక్ రెడ్డి, ఎస్‌ఈ ఎస్‌ఎన్ డీపీ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ ఎస్‌ఎన్ డీపీ మాధవి లత, ఈఈలు కార్తిక్, నారాయణ, రమేష్ బాబు, ఎల్బీనగర్, సరూర్ నగర్ డిప్యూటీ కమిషనర్లు మల్లికార్జునరావు, శ్రీనివాస్, టీపీఎస్ ఏసీపీ ప్రతాప్, సత్యభామ, డీఈలు రవిచంద్, విజయ్కుమార్, ఏఈలు విజయ్కుమార్, మల్లికార్జున, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.