8 June, 2026 | 2:45 AM

డీజిల్ ట్యాంక్‌లో పెట్రోల్..?

08-06-2026 01:26 AM

రెండు నెలలుగా డీజిల్ అమ్మకాల నిలిపివేత

కేసముద్రం, జూన్ 7 (విజయక్రాంతి): పొరపాటున డీజిల్ ట్యాంక్ లో పెట్రోల్ నింపడంతో కొద్ది రోజులుగా డీజిల్ అమ్మకాలు నిలిపివేయడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల లో చోటుచేసుకుంది.

కలవల గ్రామంలోని ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన పెట్రోల్ పంపులో కొద్దిరోజుల క్రితం పెట్రోల్ స్టాక్ తెప్పించారు. అయితే ట్యాంకర్ డ్రైవర్ పొరపాటున పెట్రోలను పంపులోని డీజిల్ ట్యాంకులో నింపాడు. డీజిల్ ట్యాంకులో పెట్రోల్ నింపిన సంఘటన గుర్తించిన నిర్వాహకులు వెంటనే డీజిల్ అమ్మకాలను నిలిపివేశారు.

ఫలితంగా కొద్దిరోజులుగా ఆ పంపులో కేవలం పెట్రోల్ మాత్రమే విక్రయిస్తూ, డీజిల్ అమ్మకాలను నిలిపివేయడంతో రైతులు, భారీ వాహన యజమానులు డీజిల్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పెట్రోల్ పంపు నిర్వాహకులను వివరణ కోరగా పొరపాటున డీజిల్ ట్యాంకులో పెట్రోల్ నింపడం జరిగిందని, అందులో నింపిన పెట్రోల్ ను పూర్తిగా తొలగించి ట్యాంకు శుభ్రం చేసి తిరిగి అమ్మకాలకు చర్యలు తీసుకుంటున్నామని, మరో వారం రోజుల్లో డీజిల్ అమ్మకాలు ప్రారంభిస్తామని చెప్పారు.