30-07-2025 08:39:16 PM
కలెక్టర్ కుమార్ దీపక్...
భీమారం (విజయక్రాంతి): భీమారం మండల కేంద్రంలో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) కోరారు. బుధవారం పీహెచ్సీ నిర్మాణ పనులను ఎంపీడీవో మధుసూదన్(MPDO Madhusudhan)తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో స్థానిక ప్రజలకు మరింత వేగవంతమైన మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పీహెచ్సీ నిర్మాణాన్ని చేపట్టామన్నారు.
పాఠశాల తనిఖీ..
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎస్.ఐ. శ్వేతతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజన నాణ్యత, తరగతి గదులు, హాజరు పట్టిక, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, శుద్ధమైన త్రాగు నీటిని ఇవ్వాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా వ్యక్తిగత పరిశుభ్రత, ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రపరచుకోవడం వంటి అంశాలను విద్యార్థులకు వివరించాలని, పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పాఠశాలలో కొనసాగుతున్న మూత్రశాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, విద్యార్థులకు మంజూరైన స్పోర్ట్స్ కిట్లను అందించి క్రీడారంగంలో రాణించే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. ఉపాధ్యాయులు విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, సమయ పాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించాలన్నారు.
ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీ..
మండల కేంద్రంలోని శ్రీలక్మి ఫెర్టిలైజర్ దుకాణాన్ని సందర్శించి స్టాకు నిల్వలు, ధరల పట్టిక, రశీదు పుస్తకాలను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. రైతులకు విక్రయించిన వాటికి సంబంధించి రశీదు జారీ చేయాలని, దుకాణం ఎదుట ధరల పట్టిక, స్టాకు నిల్వల వివరాలు తప్పనిసరిగా ప్రదర్శించాలని కోరారు. నకిలీ, నిషేధిత విత్తనాలు, ఎరువుల విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. డి.సి.ఎం.ఎస్. రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు.
మండలంలోని బూరుగుపల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా అంశాలను పరిశీలించారు. వర్షాకాలం అయినందున పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, అంతర్గత రహదారులు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, దోమల వృద్ధిని అరికట్టేందుకు నీటి నిల్వలను తొలగించడంతో పాటు ఆయిల్ బాల్స్, బయోటెక్ స్ప్రే పిచికారి చేయాలని తెలిపారు. ప్రతి ఇంటికి శుద్ధమైన త్రాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిరుపేదల కొరకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ది పొందిన లబ్దిదారులు తమ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని, నిబంధనల ప్రకారం 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకోవాలని తెలిపారు.
జిల్లా వ్యవసాయ అధికారి భుక్య ఛత్రు నాయక్, తహసిల్దార్ సదానందంనలతో కలిసి మండలంలోని దాంపూర్ గ్రామంలో గల అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి పరిసరాలు, ఆహార నాణ్యత, రిజిస్టర్లను పరిశీలించారు. గర్భిణులు, బాలింతలు, పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చర్యలు తీసుకుంటుందని, పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమయానుసారంగా పిల్లల ఎత్తు, బరువు పరిశీలించి ఎదుగుదల లోపం ఉన్న పిల్లలను గుర్తించి అవసరమైన మందులు, పోషకాహారం అందించి సాధారణ స్థితికి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గర్భిణులకు గర్భస్థ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, వైద్య పరీక్షలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని గుర్తించేందుకు స్థల పరిశీలన చేశారు.