calender_icon.png 20 January, 2026 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడల్ సోలార్ విలేజ్ ఎంపికకు ప్రణాళికలు

20-01-2026 12:00:00 AM

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల, జనవరి 19(విజయక్రాంతి): మోడల్ సోలార్ విలేజ్ జిల్లాలోని ఒక గ్రామాన్ని ఎంపికకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. భారత ప్రభుత్వ నూతన, పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ ఎంఎన్‌ఆర్‌ఈ ద్వారా అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన కింద జిల్లాలో ఇప్పటికే సోలార్ విద్యుత్ ఎక్కువ వినియోగిస్తున్న గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్గా అభివృద్ధి చేసేందుకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో రెడ్కో, డీఆర్డీఓ, డీపీఓ సెస్ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో సంపూర్ణ సోలరైజేషన్, స్వచ్ఛ శక్తి వినియోగం, శక్తి స్వయం సమృద్ధిని ప్రదర్శించడమే ఈ మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని తెలిపారు.ఎంఎన్‌ఆర్‌ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా, జిల్లాస్థాయి కమిటీ ఒక గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమం అమలుకు ఎంపిక చేస్తుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు అమలుకు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్)ను నియమించారని వివరించారు.

ఎంపిక చేసిన గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు వంటి కార్యాల యాలకు విద్యుత్ ఖర్చుల భారం తగ్గించేందుకు సోలార్ పవర్ ఉపయోగపడుతుందని తెలిపారు. వీటికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలు, పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.122.38 లక్షలు కాగా, ఇందులో రూ.100 లక్షలను కేంద్ర ఆర్థిక సహాయంగా సి ఎప్ ఏ ఎంఎన్‌ఆర్‌ఈ నుంచి కోరుతున్నారని, మిగితా రూ.22.38 లక్షలను గ్రామ పంచాయతీ వాటాగా సమకూర్చనున్నారని రెడ్కో అధికారులు వివరించారు.సమావేశంలో డీఆర్డీఓ గీత, రెడ్కో అధికారి లక్ష్మీ కాంతరావు, సెస్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి , ఎల్డీఎం మల్లికార్జున రావు, డీపీఓ కార్యాలయ ఏవో నరేష్ కుమార్ తదితరులు ఉన్నారు.