8 June, 2026 | 1:22 AM

ముగిసిన పీఎంజే దోపిడీ కేసు

08-06-2026 12:00 AM
  1. ముగ్గురు నిందితుల పోలీస్ కస్టడీ 
  2. బీహార్లో మరో కీలక నిందితుడు అరెస్ట్

కరీంనగర్ క్రైం, జూన్ 7 (విజయ క్రాంతి): కరీంనగర్ పీఎంజే జువెలరీ షాప్ దోపిడీ  కేసు దర్యాప్తులో భాగంగా ముగ్గురు ప్రధాన నిందితులను పోలీసులు నాలుగు రోజుల పాటు ఈనెల 3 నుండి 7 వరకు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆదివారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మీడియాతో మాట్లాడుతూ నిందితులైన  సుబోధ్ సింగ్, రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరా సింగ్,  రవీష్ కుమార్ అలియాస్ ప్రద్యుమన్  పోలీస్ కస్టడీ సమయంలో సాక్షుల సమక్షంలో నిందితులను సుదీర్ఘంగా విచారించగా, కీలకమైన ఆయుధాలు, మొబైల్ ఫోన్ రికవరీ అయ్యాయని తెలిపారు.

వెలిచాల బైపాస్ రోడ్ వద్ద గల చెట్ల పొదలలో దాచి ఉంచిన నేరానికి ఉపయోగించిన రెండు పిస్టల్స్ ను, మద్దునూరు గ్రామ పరిధిలోని బగ్గారం మండల అటవీ ప్రాంతం సమీపంలో నేరానికి సంబంధించిన ఒక మొబైల్ ఫోన్ను గుర్తించి పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విచారణలో కొంత సమాచారం సేకరించినప్పటికీ, నిందితులు పూర్తిస్థాయిలో పోలీసులకు సహకరించలేదని పేర్కొన్నారు.

దొంగిలించిన సొత్తు ఎక్కడ దాచారు? ఎవరికి విక్రయించారు? ఎవరెవరికి ఆర్థిక లావాదేవీలు జరిగాయి? అనే కీలక సమాచారాన్ని నిందితులు ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నారని తెలిపారు. ఆభర ణాల దాచివేత, రవాణా విషయాలపై నిందితులు పరస్పర విరుద్ధమైన, తప్పుదారి పట్టించే వాంగ్మూలాలు ఇచ్చారని, కేసును ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించడానికే నిందితులు ఇలా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ నేపథ్యంలో నిందితులను మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరు తూ న్యాయస్థానంలో ప్రత్యేకంగా రిక్విజిషన్ దాఖలు చేయనున్నామని సిపి తెలిపారు.

పరారీలో ఉన్న మరో నిందితుడి అరెస్ట్..

బీహార్ రాష్ట్రం, పాట్నా జిల్లాలోని సలింపూర్లో ఏ-10 నిందితుడైన అమర్సింగ్ అలియాస్ పహిల్వాన్ అలియాస్ అమరేంద్ర కుమార్ సింగ్ ను ఈనెల 4న పోలీసులు అరెస్ట్ చేశారని సిపి తెలిపారు. నిందితుడిని అక్కడ స్థానిక న్యాయస్థానం ముందు హాజరుపరిచి, కరీంనగర్కు తీసుకువచ్చి ఇక్కడి న్యాయస్థానంలో ప్రవేశపెట్టడానికి  పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ పొందారని తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేక పోలీస్ బృందం నిందితునితో కలిసి కరీంనగర్ కు ప్రయాణంలో ఉన్నదని పేర్కొన్నారు. ఈ కేసులోని మిగిలిన పరారీ నిందితుల కోసం గాలింపు చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని సీపీ గౌష్ ఆలం వివరించారు.