కవితపై విషపు వ్యాఖ్యలు ఖండనీయం
రాజగోపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: టిఆర్‌ఎస్ నాయకులు కొట్టాల యాదగిరి
గజ్వేల్, ఏప్రిల్ 30: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కవితక్కపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నూతన టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కొట్టాల యాదగిరి తీవ్రంగా ఖండించారు. గజ్వేల్ నియోజకవర్గంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి పదవి రాలేదన్న ఆవేదనతోనే రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
రాజకీయాల్లో విమర్శలు సహజమే కానీ మహిళలపై వ్యక్తిగత దాడులు చేయడం నీచమైన రాజకీయాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేయడం ద్వారా రాష్ట్ర మహిళల భావాలను దెబ్బతీశారని అన్నారు. పూటకో పార్టీ, పూటకో మాట మాట్లాడే రాజగోపాల్ రెడ్డి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు.
కవితక్కపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహిళలు, ప్రజాసంఘాలు తగిన విధంగా స్పందిస్తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల నర్సింలు, నరేందర్ రెడ్డి, రాజయ్య, శ్రీకాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.






